OVERWHELMING RESPONSE TO SRIVARI MEDICAL SEVA _ శ్రీవారి వైద్యసేవకు అపూర్వ స్పందన

Tirupati, July 6, 2026: TTD Joint Executive Officer Dr. A. Sharath said the Srivari Medical Seva programme has received an overwhelming response from specialist doctors in India and abroad.

So far, 488 medical specialists have registered to offer voluntary services. As part of the programme, expert veterinary doctors are also serving at SV Gosamrakshana Shala, where over 450 native cows have undergone health check-ups and several complex surgeries have been successfully performed.

Dr. Sharath said Go Seva is equivalent to serving Lord Venkateswara and appealed to more doctors and professionals to join this unique voluntary service.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

శ్రీవారి వైద్యసేవకు అపూర్వ స్పందన

దేశ విదేశాల నుంచి సేవకు ముందుకొస్తున్న నిపుణ వైద్యులు

గోసేవ ద్వారా గోవిందుని సేవ చేసే మహద్భాగ్యం : టీటీడీ జేఈవో డా. . శరత్

తిరుపతి, 2026 జూలై 06: శ్రీవారి సేవ ప్రతి భక్తుడి జీవితంలో లభించే మహాభాగ్యమని, అదే స్ఫూర్తితో టీటీడీ ప్రారంభించిన “శ్రీవారి వైద్యసేవ” కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, విదేశాల్లోని నిపుణ వైద్యుల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. ఎ. శరత్ తెలిపారు. సోమవారం ఎస్వీ గోసంరక్షణశాలలో జరుగుతున్న వైద్యసేవలను ఆయన నిపుణ వైద్యులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, భక్తుల సేవలో విజయవంతంగా కొనసాగుతున్న శ్రీవారి సేవ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వైద్య, పశువైద్య, ఇతర వృత్తి నిపుణులను స్వచ్ఛంద సేవలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో శ్రీవారి వైద్యసేవ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించిందన్నారు.

టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మార్గదర్శకత్వంలో స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద కళాశాల, గోశాల, వైద్య విభాగం తదితర సంస్థల అధిపతులతో పలు సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి సమగ్ర కార్యాచరణ రూపొందించిన అనంతరం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మూడు నెలల ట్రయల్ రన్‌గా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

488 మంది నిపుణ వైద్యుల నమోదు

జూన్ 20 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కాగా ఇప్పటికే 488 మంది స్పెషలిస్టు వైద్యులు, వివిధ విభాగాల నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. స్పెషలిస్టు వైద్యులకు మూడు రోజుల సేవా అవకాశం, ఇతర వైద్యులకు ఏడు రోజుల సేవా వ్యవధిని కల్పించామని చెప్పారు. అంతేకాకుండా, ఆసక్తి ఉన్నవారు నెలరోజులు, ఆరు నెలలు లేదా ఏడాది పాటు కూడా సేవలందించే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా ఆయా విభాగాధిపతుల ద్వారా సేవా స్లాట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు.

గోసేవకు అపూర్వ స్పందన

శ్రీవారి వైద్యసేవలో భాగంగా ప్రారంభించిన గోసేవ కార్యక్రమానికి కూడా విశేష ఆదరణ లభిస్తోందని జేఈవో తెలిపారు. ఇప్పటివరకు మూడు బ్యాచ్‌ల సేవా స్లాట్లు పూర్తిగా భర్తీ కావడం ఈ కార్యక్రమానికి లభిస్తున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.

వారం రోజుల పాటు సేవలందించిన డా. నరేంద్రరెడ్డి, అనంతరం సేవలందించిన డా. జి. పద్మనాభన్ తదితరులు ఈ సేవ తమ జీవితంలో మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని, శ్రీవారికి సేవ చేసే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పినట్లు జేఈవో తెలిపారు.

మూడో బ్యాచ్ గో వైద్యసేవలు కొనసాగుతున్నాయి

శ్రీవారి వైద్యసేవలో భాగంగా ఎస్వీ గోసంరక్షణశాలలో గోవులకు నిపుణులైన పశువైద్యులు సేవలందిస్తున్నారు.

జూన్ 22–28: తొలి బ్యాచ్

జూన్ 29–జూలై 05: రెండో బ్యాచ్

జూలై 06–12: మూడో బ్యాచ్

ప్రస్తుతం మూడో బ్యాచ్‌లో డా. జి. పద్మనాభన్ (అసిస్టెంట్ డైరెక్టర్, సింగనమల, అనంతపురం జిల్లా), రిటైర్డ్ ప్రొఫెసర్ డా. శ్యాంసుందర్ (ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయం, తిరుపతి), అమెరికా ఫ్లోరిడాలో స్థిరపడిన డా. చక్రవర్తి రెడ్డి తదితర నిపుణులు సేవలందిస్తున్నారు.

450 గోవులకు ఆరోగ్య పరీక్షలు – 250 గోవుల్లో గర్భధారణ అవకాశాల గుర్తింపు

గోసంరక్షణశాలలో గోవులకు గర్భకోశ సంబంధిత వ్యాధులు, శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ, నివారణ తదితర ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారు.

ఇప్పటి వరకు 450 దేశీయ గోవులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, అందులో 250 గోవుల్లో గర్భధారణకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. వాటికి అవసరమైన దాణా, వైద్యం, శస్త్రచికిత్సలు, పోషకాహారం, రోజువారీ సంరక్షణపై గోశాల సిబ్బందికి నిపుణులు ప్రత్యేక సూచనలు అందిస్తున్నారు.

అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతం

గోవుల్లో యోని సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాటికి ప్రత్యేక వైద్యసేవలు అందించారు. ఒక గోవుకు పేడ వెలువడే మార్గం, ప్రసవ మార్గం రెండూ ఒకటిగా ఉండటంతో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి రెండు మార్గాలను వేర్వేరుగా రూపొందించారు. మరో గోవు నడవలేని పరిస్థితిలో ఉండటంతో కాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఇలాంటి క్లిష్టమైన చికిత్సలను నిపుణులైన పశువైద్యులు అత్యంత నైపుణ్యంతో నిర్వహిస్తున్నారని జేఈవో తెలిపారు.

గోశాలను సందర్శించిన ఏపీ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ ఛైర్మన్

ఏపీ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ ఛైర్మన్ డా. పి.వి. లక్ష్మయ్య సోమవారం ఎస్వీ గోసంరక్షణశాలను సందర్శించి గోవులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డా. లక్ష్మయ్యను టీటీడీ అధికారులు శాలువాతో సత్కరించారు. అలాగే గోసేవలో పాల్గొంటున్న నిపుణ వైద్యులను ఘనంగా సన్మానించారు. వైద్యులకు టీటీడీ కల్పిస్తున్న వసతి, భోజనం, ఇతర సౌకర్యాలపై ఆరా తీయగా, వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

గోసేవ అంటే శ్రీవారి సేవే” – డా. జి. పద్మనాభన్

పశువైద్య నిపుణులు డా. జి. పద్మనాభన్ మాట్లాడుతూ, గోసేవ చేయడం అంటే శ్రీవారికి సేవ చేసినట్లేనని అన్నారు. వారం రోజుల పాటు గోవులకు వైద్యసేవలు అందించడం అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. అవసరమైన చికిత్సలు, శస్త్రచికిత్సలు, వ్యాధి నివారణ చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

మరింత మంది వైద్యులు ముందుకు రావాలిజేఈవో పిలుపు

శ్రీవారి వైద్యసేవలో పాల్గొన్న ప్రతి వైద్యుడు తన అనుభవాన్ని సహచర వైద్యులు, ఇతర నిపుణులతో పంచుకుని మరింత మందిని ఈ మహోన్నత సేవలో భాగస్వాములను చేయాలని జేఈవో డా. ఎ. శరత్ పిలుపునిచ్చారు.

మూడు నెలల ట్రయల్ రన్‌లో భాగంగా వైద్యులు, సేవకులు అందించే సూచనలు, సలహాలను స్వీకరించి అవసరమైన మార్పులు చేసి, శ్రీవారి వైద్యసేవను పూర్తిస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సేవలందించిన ప్రతి వైద్య నిపుణుడికి టీటీడీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రీవారి కృప వారందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, మరింత మంది వైద్యులు ఈ దైవిక సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ డా. పార్థసారధి, మేనేజర్లు, డా. భువన, డా. అనిల్ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.