PADMAVATHI PARINAYOTSAVAM FROM MAY 10-12 _ మే 10 నుండి 12వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

TIRUMALA, 03 MAY 2022: The annual three-day Padmavathi Parinayotsavams will be observed from May 10-12 at Narayanagiri Gardens in Tirumala.

Due to Covid pandemic this annual fete was not performed in the last two years. This year TTD is all set to perform the celestial wedding ceremony in a grand manner and already began arrangements for the same.

On first day, Sri Malayappa Swamy will arrive to the Parinayotsava Mandapam on Gaja, second day on Aswa and on the final day on Garuda Vahanam, while His two consorts on separate Tiruchis. Later Unjal Seva followed by devotional sangeet and Harikatha Parayanam will be performed by the artistes of Annamacharya Project.

TTD has cancelled Arjita Brahmotsavam and Sahasra Deepalankara Sevas during these three days.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మే 10 నుండి 12వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల, 2022 మే 03: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 10 నుండి 12వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు :

శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాలు సంద‌ర్భంగా మే 10 నుండి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

పౌరాణిక ప్రాశస్త్యం :

పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.