PADMAVATI SHOWERS HER BLESSINGS FROM GARUDA VAHANAM _ గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
TIRUPATI, 22 NOVEMBER 2025: On sixth evening on Saturday, Sri Padmavati Ammavaru blessed Her devotees shining bright on Garuda Vahanam wearing the Swarna Padukalu.
Both the Pontiffs, EO Sri AK Singhal, board members, Smt Suchitra Ella, Smt Panabaka Lakshmi, Smt Janaki Devi, Sri Sambasiva Rao and others were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
తిరుపతి 2025 నవంబర్ 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి 7 గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
గరుడసేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. తిరుచానూరులో అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నపుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతున్నారు. గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారు, అమ్మవారిని గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా నిజసుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ సాంబశివరావు, శ్రీమతి జానకి దేవి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ,
ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, శ్రీనివాస చార్యులు, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.










