MOHINI AVATARAM HELD _ పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు

Tirupati, 31 March 2025: The ongoing annual Brahmotsavam at Sri Kodandarama Swamy temple in Tirupati witnessed Sri Rama blessing His devotees as Mohini.

On Monday morning, the deity draped in colourful robes and flowers and dazzling jewels seated majestically inside the finely decked Palanquin as Universal Celestial Damsel which mesmerized the devotees.

The pontiffs of Tirumala, DyEO Smt Nagaratna and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు

తిరుపతి, 2025 మార్చి 31: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.

ఉదయం 8 గంటలకు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం తప్పదు. ఆ కలహాన్ని నివారించి, అసురులను వంచించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.

త‌రువాత ఉద‌యం 9.30 గంట‌ల‌కు గ‌రుడ‌ పాదుక‌ల ఊరేగింపు ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఘనంగా జ‌రిగింది. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 7 నుండి 10 గంటల వరకు గరుడసేవ అత్యంత వేడుకగా జరగనుంది.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్‌ శ్రీ ముని శంకర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.