PENSIONS TO BE PAID ON RETIREMENT DAY ITSELF-TTD EO _ ఉద్యోగ విరమణ రోజే పెన్షన్ చెల్లింపు : తితిదే ఈవో
ఉద్యోగ విరమణ రోజే పెన్షన్ చెల్లింపు : తితిదే ఈవో
తిరుపతి, జూన్ 17, 2013: ఉద్యోగ విరమణ చేసిన రోజే ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపులు జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల తన కార్యాలయంలో సోమవారం ఈవో వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ చాలా విభాగాల్లో ఉద్యోగుల పెన్షన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, కొన్ని విభాగాల్లో మాత్రమే నత్తనడకన సాగుతోందని అన్నారు. దీనికి సంబంధించి జూలై నెలాఖరు నాటికి అన్ని విభాగాల్లో నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమాలను అప్పుడప్పుడు కాకుండా అందరికీ కలిపి ఒకేసారి నెలాఖరులో నిర్వహించేలా చూడాలని సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి వనజను ఆదేశించారు. ప్రతినెలా మూడో మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి దర్శనంతోపాటు రంగనాయకుల మండపంలో రిటైర్ ఉద్యోగులకు వేదాశీర్వచనం అందించడం ప్రశంసనీయమని, దీన్ని కొనసాగించాలని కోరారు.
తితిదే పరిపాలనా భవనంలోని క్యాంటీన్‌ను పరిశుభ్రంగా ఉంచి, మంచి వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రత, ఫర్నిచర్, వంటకాల్లో శుచి-శుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, అన్నదానం అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తితిదే జెఈవోలు శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్, అన్ని విభాగాధిపతులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.