PETITIONS COMMITTEE LAUDS TTD FOR THE INTERNATIONAL AWARD _ తితిదేకు అంతర్జాతీయ పురస్కారంపై శాసనసభ ఫిర్యాదుల కమిటీ ప్రశంస
తిరుపతి, 2012 ఆగస్టు 6: ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఘనవ్యర్థాల నిర్వహణలో అంతర్జాతీయ పురస్కారం దక్కడంపై శాసనసభ ఫిర్యాదుల కమిటీ అధ్యకక్షులు శ్రీ మల్లు భట్టివిక్రమార్క, ఇతర సభ్యులు ప్రశంసలు కురిపించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సోమవారం జరిగిన ఫిర్యాదుల కమిటీ సమావేశంలో ఆయన తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యంను అభినందించారు.
ఘన వ్యర్థాల నిర్వహణ అనే అంశంపై గాలి, నీటి కాలుష్య అంతర్జాతీయ నియంత్రణ సంస్థ, మైసూర్ నగర కార్పొరేషన్, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో ఇటీవల మూడు రోజులు పాటు సదస్సు జరిగింది. ఇందులో తితిదే తరఫున సదస్సుకు హాజరైన ఆరోగ్య శాఖ అధికారి శ్రీ భీష్మయ్య నాయుడు అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న వేలాది మంది భక్తులకు పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ లేకుండా చర్యలు చేపడుతున్నందుకు గాను సదస్సు నిర్వాహకులు ఈ పురస్కారాన్ని అందజేశారు.
సమిష్టి కృషి ఫలితమే ఈ పురస్కారం : శ్రీ భీష్మయ్యనాయుడు
తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, సంయుక్త కార్యనిర్వహణాధికారులు శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ఆరోగ్య శాఖ కార్మికులు, పారిశుద్ధ్య సిబ్బంది సమిష్టి కృషితోనే ఈ పురస్కారం దక్కిందని ఆరోగ్య శాఖ అధికారి శ్రీ భీష్మయ్యనాయుడు పేర్కొన్నారు. తితిదే ఇంజినీరింగ్ అధికారులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తదితర అధికారులతో పాటు భక్తులు కూడా ఇందుకు సహకరించినట్టు తెలిపారు. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగింద న్నారు. తిరుమలలో థలవారీగా ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి మెరుగైన పారిశుద్ధ్యానికి కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.