PILGRIMS FLOOD TIRUMALA-30HRS FOR SARVA DARSHAN _ కొండంతా జనం – ఏర్పాట్లను పరిశీలించిన జె.ఇ.ఓ
కొండంతా జనం – ఏర్పాట్లను పరిశీలించిన జె.ఇ.ఓ
తిరుమల, 16 జూన్ 2013 : వారాంతపు సెలవులు కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా కాలినడక యాత్రికుల సంఖ్య సాధారాణ రోజులకన్నా ద్విగుణీకృతమైంది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన రద్దీ సోమవారం రాత్రిదాకా కొనసాగే ఆవకాశం ఉందని తి.తి.దే అధికారుల అంచనా వేస్తున్నారు. కాగా ఆదివారం నుండి తిరుమలకు భక్తుల తాకిడి మరింత పెరగడంతో సర్వదర్శనానికి 30 గంటలు, కాలిబాట దర్శనానికి 12 గంటలు, రూ.300/- దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది.
తిరుమలకు వెళ్ళే అలిపిరి కాలిబాట మరియు శ్రీవారిమెట్టు కాలిబాటల్లో యాత్రికుల సంఖ్య సాధారణ రోజుల్లో 6000 నుండి 10,000 నడుమ ఉండగా వారాంతపు సెలవు దినాల్లో దాదాపు 15,000 కు చేరుకుంటుంది. అటువంటిది ఈ సంఖ్య శనివారం 37,000ల మంది, ఆదివారం మధ్యాహ్నం సమయానికే ఈ సంఖ్య 27,000లకు పైగా కావడంతో తిరుమల భక్తజనసంద్రమైంది.
ఏర్పాట్లను పరిశీలించిన జె.ఇ.ఓ ః-
తిరుమలలో అనూహ్యస్థాయిలో పెరిగిన రద్దీ దృష్ట్యా తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు వివిధ విబాగాధిపతులను వెంటపెట్టుకొని తిరుమలలోని వివిధ మార్గాల క్యూలైన్లలో కలియతిరిగారు. ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద వితరణ, త్రాగునీటి పంపిణీ తీరును మ్యాన్‌ప్యాక్ ద్వారా వాకబుచేసి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. మరో ప్రక్క భక్తులకు వివిధ దర్శనాలకు సంబంధించిన భక్తులకు దర్శన సమయాన్ని గురించి మైక్‌సెట్‌ద్వారా నిరంతరాయంగా ప్రకటనలు చేస్తూ, భక్తులకు తెలిసేలా చర్యలు చేపట్టారు.
అనంతరం జె.ఇ.ఓ తనను కలసిన మీడియావారితో మాట్లాడుతూ కాలిబాట భక్తుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరగుతున్న కారణంగా దాని ప్రభావం ఇతర దర్శన భక్తులపై చూపుతున్నదన్నారు. తద్వారా అన్ని దర్శనాల క్యూలైన్లలో ఉన్న భక్తులు స్వామి దర్శనం కోసం అధిక సమయం వేచివుండాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే తమ అధికార సిబ్బంది కూడా గత మూడురోజులుగా భక్తుల మద్య కలియ తిరుగుతూ వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చక్కటి ఏర్పాట్లు చేశారన్నారు. ఇందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం ఉదయం వి.ఐ.పి విరామదర్శనం రద్దు చేస్తునట్లు తెలిపారు. అయితే ప్రోటోకాల్ వి.ఐ.పిలలో అత్యంత ప్రముఖులకు మాత్రం దర్శనం కల్పిస్తునట్లు ఆయన తెలిపారు.
ఈ ఏర్పాట్ల తనిఖీలో తిరుమల జె.ఇ.ఓతో పాటు అదనపు సి.వి.ఎస్.ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఇ.ఇలు శ్రీ క్రిష్ణారెడ్డి, శ్రీ నరసింహమూర్తి, శ్రీ సుబ్రహ్మణ్యం, ఎలట్రికల్ డి.ఇ.ఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, రిసెప్షన్ డిప్యూటి.ఇ.ఓ1 శ్రీ వెంకటయ్య, అన్నదానం డిప్యూటి.ఇ.ఓ శ్రీ వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.