PROCESSION OF DIVINE WOODEN CHARIOT HELD _ భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

Tirumala, 7 Oct. 19: On the penultimate day of annual brahmotsavams at Tirumala, the grand procession of the mammoth wooden chariot was held on Monday. 

The giant car marched along the jam-packed four mada streets with pilgrims on the bright Sunny Day. 

The processional deities of Sri Malayappa Swamy,  Sri Devi and Bhudevi mounted on a well-decked platform in the chariot was dragged by enthusiastic pilgrims who chanted Govinda… Govinda with religious ecstasy. 

 

As Tallapaka Annamacharya described in his sankeertan,  “the sky and earth became one as the Brahmanda Ratham marched along the streets and it is a treat to the eyes who witness the grand celestial procession of Maha Ratham”. 

TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

 తిరుమల,, 2019 అక్టోబ‌రు 07: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన సోమ‌వారం ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేసారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామసంకీర్తనలు, పలురకాల భజనల నినాదాలు మిన్నుముట్టాయి.

అనాదికాలంనుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలు పూన్చిన రథంపై విహరిస్తాడు.

ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉన్నది.

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే” అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా తిరుమల తిరుపతి దేవస్థానమువారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీథులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉన్నది. కఠోపనిషత్తులో ఆత్మకూ శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరంవేరనీ, సూక్ష్మశరీరంవేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు. కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితంగా ఉన్నది.

కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది.

        ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు సోమ‌వారం రాత్రి 8.00 నుండి 10.00 గంటల నడుమ శ్రీమలయప్పస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించ‌నున్నారు.

ఎనిమిదవరోజు రాత్రి స్వామివారు అశ్వంపై కూర్చొని, తనవేగశక్తినీ, బలశక్తినీ నిరూపిస్తుంటారు. వేగశక్తి  అశ్వలక్షణం. సృష్టిలో యజ్ఞం తర్వాత పుట్టిన జీవి గుర్రమే! తర్వాతనే ఆవులూ, మేకలూ మున్నగు జంతువులు రూపొందాయి. ప్రయాణసాధనాల్లో మునుపు అశ్వానిదే అగ్రస్థానం. రథాన్ని లాగేవి గుర్రాలే! యుద్ధాలలో ఆశ్వికదళం అధికంగా ఉంటుంది.

శ్రీహరి శ్రీనివాసుడై ఈ లోకంలో వేంకటాచలం చేరి, అటనుండి పద్మావతీదేవిని పెండ్లాడడానికై మొట్టమొదట వేటనెపంతో గుర్రంపైనే వచ్చాడు. ఆ గుర్రమే తనకు వివాహవాతావరణాన్ని కల్పించడంలో ప్రముఖసాధనమైంది. శ్రీహరి యొక్క జ్ఞానావతారాల్లో మొదటిది హయగ్రీవావతారమే! అంటే గుర్రంముఖం కల్గినమూర్తి. హయగ్రీవుడు విద్యాధిదేవత. ఈకారణాలవల్లనూ స్వామికి బ్రహోత్సవవాహనసేవల్లో మొదట పెద్దశేషవాహనం కుండలినీ యోగానికి సంకేతమైతే  – చివర అశ్వవాహనం ఓంకారానికి సంకేతమై – కుండలినీ యోగంతో ప్రణవాన్ని (ఓంకారాన్ని) చేరి, ఆనందించే తత్త్వాన్ని ఆద్యంత ఉత్సవాలు నిరూపిస్తున్నాయి. చక్కని సమన్వయాన్ని కల్గిస్తున్నాయి.

ఇంతేకాక ఈ కలియుగాంతంలో స్వామి కల్కిమూర్తియై గుర్రంపై పయనిస్తూ – ఖడ్గధారియై దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. కనుక ఈ అశ్వవాహనత్వం కల్కి అవతారాన్ని గుర్తుచేస్తూంది. ఇంద్రునికి ఏనుగుతోపాటు గుర్రం కూడా వాహనంగా ఉంది. ఆధ్యాత్మికంగా పరమాత్మే అశ్వం. ఆయనే మనహృదయంలోఉండి, ఇంద్రియాల్ని నియమిస్తున్నాడు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది