PUSHPAYAGAM PERFORMED _ సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం
TIRUMALA, 01 NOVEMBER 2022: The colourful and divine ritual of flowers, Pushpayagam was performed with religious fervour in Tirumala temple on Tuesday evening.
The archakas performed the fete with utmost devotion chanting Vishnu Mantras offering nine tonnes of varieties of flowers and invoking the blessings of Pulludu-the chief deity of Pushpayagam, seeking His divine grace to save the entire life from all catastrophies.
Later Garden Deputy Director Sri Srinivasulu was felicitated on the occasion as it was a practice.
TTD EO Sri Dharma Reddy, Board Members Sri Rambhupal Reddy, Sri Madhusudhan Yadav, Sri Maruti Prasad and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం
– పుష్పయాగంతో పులకించిన తిరుమల
తిరుమల, 2022 నవంబరు 01: పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేపట్టారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రా భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.
పుష్పాధిదేవుడు ”పుల్లుడు” ఆవాహన :
పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు.
వైభవంగా పుష్పాల ఊరేగింపు
ముందుగా ఉదయం ఉద్యానవన విభాగం కార్యాలయం నుండి శ్రీవారి ఆలయం వరకు పుష్పాల ఊరేగింపు వైభవంగా జరిగింది. పుష్పాల దాతలు, శ్రీవారి సేవకులు గోవిందనామస్మరణతో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం జరుగుతోందని, ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి పునరుద్ధరణ జరిగిందని చెప్పారు. పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు.
ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం :
శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులును ఆలయ అధికారులు శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ మధుసూదన్ యాదవ్, శ్రీ మారుతిప్రసాద్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్, ఎవిఎస్వోలు శ్రీ గిరిధర్, శ్రీ శివయ్య, పారుపత్తేదార్ శ్రీ తులసిప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.