RATHOTSAVAM IN SRI PRASANNA VENKATESWARA SWAMY TEMPLE _ వైభవంగా ప్రసన్న వెంకన్న రథోత్సవం
వైభవంగా ప్రసన్న వెంకన్న రథోత్సవం
తిరుపతి, జూన్ 25, 2013: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. మిథున లగ్నంలో ఉదయం 7.10 గంటలకు రధారోహణం ప్రారంభమైంది. అనంతరం ఉదయం 7.40 నుండి 9.30 గంటల వరకు రథోత్సవం నిర్వహించారు. రథాన్ని అధిరోహించిన స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. కాగా రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
పుస్తకావిష్కరణ చేసిన జెఈవో :
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల ముందు తితిదే ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి రథోత్సవం సందర్భంగా తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ”తిరుపతి యాత్ర, ఇండియన్ కల్చర్(ఇంగ్లిష్)” అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. తిరుపతి యాత్ర అనే పుస్తకాన్ని డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ రచించారు. ఇందులో యాత్ర నిర్వచనాలు, దేశ, విదేశాల నుండి తిరుమల యాత్రకు వచ్చే భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడి నియమ నిబంధనలు తదితర అంశాలున్నాయి. ఇండియన్ కల్చర్ అనే పుస్తకాన్ని శ్రీ సముద్రాల నాగయ్య రచించారు. ఇందులో ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత, ద్వైత, అద్వైత సిద్ధాంతాలకు సంబంధించి ప్రముఖ పండితులు ఇచ్చిన ఉపన్యాసాలను పొందుపరిచారు. బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో ఇదివరకే శ్రీ జూలకంటి బాలసుబ్రమణ్యం రచించిన ”శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి క్షేత్ర మహత్యం”, శ్రీ యామిజాల పద్మనాభస్వామి రచించిన ”లక్ష్మీ నరసింహ పురాణం” పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి నాగరత్న, ఎడిటర్ ఇన్ చీఫ్ ఆచార్య రవ్వా శ్రీహరి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.