Release of Sri G.T Brahmotsavam Wall Poster _ మే 20 నుండి 28వ తేదీ వరకు శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవములు – టిటిడి ఛైర్మన్
మే 20 నుండి 28వ తేదీ వరకు శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవములు – టిటిడి ఛైర్మన్
తిరుపతి, 2010 మే 12: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 20వ తేది నుండి 28వ తేది వరకు జరుగుతాయని తితిదే పాలకమండలి చైర్మన్ శ్రీ డి.కె. ఆదికేశవులు వెల్లడించారు. బుధవారం స్థానిక పద్మావతి అతిధి భవనంలో చైర్మన్ శ్రీ డి.కె.ఆదికేశవులు, ఇ.ఓ శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావులు బ్రహ్మోత్సవముల పోష్టర్లను ఆవిష్కరించారు.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పారు. ఈ నెల 27వ తేదిన విజయవాడలో లక్షగళ గోవింద నామసంకీర్తనం జరుగుతుందని అదేవిధంగా గోవింద కల్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ నెల 1వ తేదిన అమెరికాలోని న్యూజెర్సీ, 9వ తేదిన శ్యాన్‌ఫ్రాన్సిస్‌కోలో జరిగిన శ్రీనివాస కల్యాణాలకు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. వేల సంఖ్యలో భారతీయలేకాకుండా అమెరికన్లు సైతం ఈ శ్రీనివాస కల్యాణాలను తిలకించి పులకించారని అన్నారు. హిందూధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హిందూధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి రాష్ట్రప్రభుత్వ సహకారంతో మరిన్ని ప్రదేశాల్లో శ్రీనివాసకల్యాణాలను నిర్వహిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డి.పి.పి సెక్రటరీ కవితాప్రసాద్, ఇన్‌చార్జ్ పి.ఆర్.ఓ నాగరాజు, స్థానిక ఆలయాల డిప్యూటి ఇ.ఓ ఝాన్సీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.