టిటిడిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
–. జాతీయ జెండాను ఎగురవేసిన ఈఓ
–. ఫిబ్రవరి 1నుంచి ఉద్యోగులకు నగదురహిత వైద్యసేవలు
–. తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి
తిరుపతి, 2022 జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ప్రాంగణంలోని మైదానంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ మరోసారి స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున టిటిడి భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
శ్రీవారి ఆలయం :
– టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం.
– కరోనా మూడో దశ(థర్డ్ వేవ్)కు సంబంధించి వైద్యనిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నాం.
– వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 3.79 లక్షల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించాం.
– తమ జీవితకాలంలో ఒక్కసారైనా శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకోలేని పేదవర్గాల వారిని ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2021 అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు దాదాపు 7500 మందికి శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించాం. అదేవిధంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 13 నుండి 20వతేదీ వరకు దాదాపు 7 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాం.
– ఫిబ్రవరి 8న రథసప్తమి పర్వదినాన్ని ఏకాంతంగా నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
– ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో ఇప్పటికే మొదటి విడతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 502 శ్రీవారి ఆలయాలు నిర్మించాం. రెండో విడతగా దాదాపు 1100 ఆలయాల నిర్మాణం, అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి.
వసతి :
– శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లోని గదులను భక్తులకు కేటాయిస్తున్నాం. అలాగే తిరుమలలోని పలు కాటేజీల్లో జరుగుతున్న మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్
– కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ద్వారా తిరుమల గదుల్లో యాత్రికుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు/సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నాం.
పుస్తక రూపంలోకి శ్రీ వేంకటేశ్వర వ్రత విధానం
– ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం అర్చకస్వాముల సాయంతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వ్రత విధానానికి రూపకల్పన చేస్తున్నాం.
శ్రీ వేంకటేశ్వర నామకోటి
– శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు భక్తులతో శ్రీ వేంకటేశ్వర నామకోటి రాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం
– తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం పనులను 2021 సెప్టెంబరు 14న ప్రారంభించాం. ఈ ఏడాది మే నెల నాటికి పూర్తి చేస్తాం.
శ్రీవారి ఆలయాలు
– జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించాం. అలాగే భువనేశ్వర్, చెన్నై, ఊలందూర్‌పేట, సీతంపేట, అమరావతి, రంపచోడవరంలో ఆలయాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. విశాఖపట్నంలో నిర్మాణం పూర్తయిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని త్వరలో ప్రారంభిస్తాం.
అంజనాద్రి అభివృద్ధి
– ఆంజనేయుని జన్మస్థలమైన తిరుమల అంజనాద్రిని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న బాల ఆంజనేయస్వామి, అంజనాదేవి ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలో అభివృద్ధిపనులు చేపట్టడం కోసం కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయిస్తున్నాం.
ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
గుడికో గోమాత :
– ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిగారి ఆదేశంతో హిందూ ధర్మాన్ని విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పటివరకు 137 ఆలయాలకు ఆవు, దూడ అందించాం.
– దేశంలో భక్తులు ఏ ముఖ్యమైన ఆలయానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి టిటిడి సిద్ధంగా ఉంది.
జాతీయ గో మహాసమ్మేళనం
– టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో గతేడాది అక్టోబరు 30, 31వ తేదీల్లో జాతీయ గో మహాసమ్మేళనం నిర్వహించాం. ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పీఠాలు, మఠాధిపతులు, గోసంరక్షణశాలల నిర్వాహకులు, గోప్రేమికులు, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులు హాజరయ్యారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమ్మేళనం తీర్మానం చేసింది.
స్థానికాలయాల్లో గోపూజ
– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీకపిలేశ్వరాలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో గోపూజ ప్రారంభించాం. భక్తులు ఈ ఆలయాల్లో గోపూజ చేసుకునే ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా, టిటిడి అనుబంధ ఆలయాల్లో వేదాశీర్వచనం ప్రారంభించాం.
– గతేడాది ఆగస్టు 22న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఊంజల్‌సేవ ప్రారంభించాం. శ్రీనివాసమంగాపురంలో భక్తుల సౌకర్యార్థం ఇటీవల కల్యాణకట్టను ఏర్పాటుచేశాం.
నవనీత సేవ
– దేశీయ గోవుల పాలతో తయారుచేసిన పెరుగును చిలికి వెన్న తయారుచేసి, శ్రీవారికి సమర్పించేందుకు గతేడాది ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా తిరుమలలో నవనీత సేవను ప్రారంభించాం. భక్తులు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నాం.
శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయం
– తిరుమలకు వెళ్లే భక్తులు గోమాతను దర్శించుకున్నాకే శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తుల కోసం అలిపిరి శ్రీవారి పాదాల చెంత శ్రీవేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయం ప్రారంభించాం.
పిండమార్పిడి ఎంఓయు
– స్వదేశీ ఆవు పాల నుండి శ్రీవారి కైంకర్యాలకు అవసరమైన నెయ్యి తయారు చేయడానికి, దేశవాళి గో జాతుల అభివృద్ధికి, ఇటీవల శ్రీవారి ఆలయంలో ప్రారంభించిన గో ఆధారిత నైవేద్యం కొరకు టిటిడి గోశాల, ఎస్వీ పశువైద్య వర్సిటీతో ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది.
ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్
– గోవులకు నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా మరింత నాణ్యమైన పాల ఉత్పత్తి జరుగుతుంది. ఇందుకోసం తిరుపతిలోని గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటుకు గతేడాది ఆగస్టు 11న తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, అమెరికాలోని న్యూయార్క్‌లో గల న్యూటెక్ బయోసైన్సెస్ సంస్థతో ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది.
మేలుజాతి దేశీయ గోవుల కొనుగోలుకు చర్యలు
– శ్రీవారి ఆలయంలో రోజువారీ కైంకర్యాలకు అవసరమయ్యే పాలు, 60కిలోల దేశీయ ఆవు నెయ్యి ఉత్పత్తి చేసేందుకు ఏడు రకాల మేలుజాతి గోవుల కొనుగోలుకు లేదా విరాళంగా స్వీకరించేందుకు నిర్ణయించాం.
గోశాలల అభివృద్ధికి ప్రణాళికలు
– ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని గోశాలల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి గోశాలల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
రైతు సాధికారిక సంస్థతో ఎంఓయు..
– రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ, ప్రకృతి వ్యవసాయ శాఖలతో టిటిడి గో ఆధారిత వ్యవసాయంపై రైతులను ప్రోత్సహించడం కోసం 2021 అక్టోబరు 12వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిగారి సమక్షంలో ఎంఓయు చేసుకుంది.
– రైతులను రసాయన ఎరువుల రహిత వ్యవసాయం దిశగా ప్రోత్సహించి వారు పండించిన శనగలు, బెల్లం, బియ్యం కొనుగోలుకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆ రైతులకు గిట్టుబాటు ధర చెల్లిస్తుంది.
అగరబత్తీలకు విశేషాదరణ
– టిటిడి ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో తయారుచేసిన పరిమళభరితమైన అగరుబత్తీలను గతేడాది సెప్టెంబరులో తిరుమలలోని పలు ప్రాంతాల్లో భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచాం. బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ఏడు కొండలకు సూచికగా అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి అనే ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను తయారుచేసి అందిస్తోంది. అగరబత్తీల కొనుగోలుకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుండడంతో ఉత్పత్తి రెట్టింపు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.
పంచగవ్య ఉత్పత్తులు
– కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మశీ సహకారంతో గృహావసరాలకు వినియోగించేందుకు పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపు, ధూప్ స్టిక్స్, ఫ్లోర్ క్లీనర్ లాంటి 15 రకాల ఉత్పత్తులను నమామి గోవింద బ్రాండ్ పేరుతో రేపటి నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
ఆయుర్వేద ఉత్పత్తులు
– టిటిడి ఆయుర్వేద ఫార్మసీని బలోపేతం చేసి మరిన్ని ఉత్పత్తులు తయారు చేసేందుకు మరో 100 రకాల ఉత్పత్తులకు ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి లైసెన్స్ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే 85 ఉత్పత్తులకు లైసెన్సులు అందాయి. ఇందులో భాగంగా ఫార్మసీ ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేసి, అవసరమైన కొత్త యంత్రాలు సమీకరించుకుంటాం.
శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి
– రాష్ట్ర ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలను శస్త్రచికిత్సల ద్వారా సరిచేసేందుకు 2021, అక్టోబరు 11న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంను ప్రారంభించాం.
– పేద కుటుంబాల వారికి ఈ ఆసుపత్రి ఎంతో ఆసరాగా నిలుస్తోంది. ఇప్పటివరకు 70 శస్త్రచికిత్సలు జరిగాయి. వీటిలో 50 శాతానికి పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు కాగా మిగతావి క్యాథ్ ల్యాబ్ ద్వారా చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్థలసేకరణ పూర్తయింది. ఇందుకు సంబంధించిన డిపిఆర్, డిజైన్లు ఖరారు చేశాం.
బర్డ్ ఆసుపత్రిలో సెరిబ్రల్ పాల్సీ పిల్లలకు ప్రత్యేక వైద్యం
– మహిళల ప్రసూతి కాన్పు సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల ఏర్పడిన సెరిబ్రల్ పాల్సీతో బాధపడే చిన్నపిల్లలకు బర్డ్ ఆసుపత్రిలో తగిన వైద్యం, శిక్షణ అందించి వారిని పూర్తిస్థాయి వికాసవంతులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం.
చేతిరాత ప్రతులు
– కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, రుషులు, పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్త పరచిన రాత ప్రతులను (మాన్యు స్క్రిప్ట్స్) భవిష్యత్ తరాలకు అందించడానికి టిటిడి నిర్ణయించింది. టీటీడీతో పాటు, తిరుపతిలోని యూనివర్సిటీలు గ్రంథాలయాల్లో ఉన్న రాతప్రతులను డిజిటైజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
వెంగమాంబ ఆరాధన కేంద్రం
– తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం వద్ద ఆరాధన కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. వెంగమాంబ రచించిన ద్విపద భాగవతాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తాం. వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.
ఇతర అభివృద్ధి పనులు
ఘాట్ రోడ్ల పునరుద్ధరణ
– గతేడాది నవంబరు 17, 18వ తేదీల్లో భారీవర్షాల కారణంగా భారీ కొండచరియలు విరిగిపడి తిరుమల రెండో ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. రూ.1.30 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి వైకుంఠ ఏకాదశి నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా, శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.60 కోట్లతో నడకమార్గం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
విపత్తుల నివారణ కరదీపిక
– వరదలు, కొండచరియలు విరిగి పడడం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వెంటనే స్పందించి భారీ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ కరదీపిక(మాన్యువల్) రూపొందిస్తున్నాం. ఇందుకోసం కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించి ముందస్తు హెచ్చరికలు చేసే యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం. రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి నష్టం జరుగకుండా మాతా అమృతానంద వర్సిటీ, ఢిల్లీ ఐఐటి నిపుణుల నుంచి సిఫారసులు తీసుకుని వాటిని అమలుచేస్తాం.
తిరుమల సుందరీకరణ
– జిఎంఆర్, శ్రీసిటి, ఫీనిక్స్ ఫౌండేషన్, ఇతర దాతల సహకారంతో తిరుమలలో ఉద్యానవనాలను అభివృద్ధి చేసి అన్ని కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం.
శ్రీవారికి పుష్పకైంకర్యం
– తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి రోజూ అవసరమయ్యే పుష్పాలను తిరుమలలోనే పండిరచుకునేలా నిర్ణయించాం. ఇందుకోసం శ్రీ సిటి సంస్థ 7 ఎకరాల్లో పుష్పతోటలను అభివృద్ధి చేసి స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తోంది.
పవిత్ర ఉద్యానవనాలు
– పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో తిరుమల శిలాతోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం, గోగర్భం డ్యామ్ వద్ద 25 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర శ్రీగంధపు పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేశాం. రెండు ప్రాంతాల్లో కలిపి 35 ఎకరాల్లో 16 వేల మొక్కలు పెంచుతున్నాం.
అకేషియా చెట్ల తొలగింపు
– తిరుమల శేషాచల అడవులలో వృక్షసంపదను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు శేషాచలం అటవీ ప్రాంతంలో సుమారు 600 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 40 రకాల అకేషియా(తుమ్మచెట్లు) తొలగించి భూసారాన్ని పెంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చెట్ల స్థానంలో సంప్రదాయ మొక్కలను పెంచుతున్నాం.
డ్రైఫ్లవర్ టెక్నాలజి
– టిటిడిలోని వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో స్వామి, అమ్మవార్ల ఫోటోలు, క్యాలండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు తదితరాలు తయారు చేయడానికి డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో 2021 సెప్టెంబరు 13న ఎంఓయు కుదుర్చుకున్నాం. స్వామివారి ఫోటోలతో పాటు కీచైన్లు, పేపర్ వెయిట్లు, రాఖీలు, క్యాలండర్లు, డ్రైఫ్లవర్ మాలలు తదితరాలను రేపటి నుండి భక్తులకు విక్రయం కోసం అందుబాటులో ఉంచుతాం.
తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం
– తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాం. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తుల అవసరాల కోసం అన్ని కాటేజీల్లో జలప్రసాదం తాగునీరు, జగ్గులు, గ్లాసులు ఏర్పాటు చేశాం. తిరుమలలోని అన్ని దుకాణాలు, హోటళ్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాం.
విద్యుత్ వాహనాలు
– తిరుమలలో డీజిల్/పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించాం. తొలిదశలో ప్రయోగాత్మకంగా 35 విద్యుత్ కార్లను ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్(ఇఇఎస్‌ఎల్) ద్వారా నెలకు రూ.32 వేలు చొప్పున అద్దె చెల్లించి తీసుకున్నాం. ఆర్టీసీ ఆగస్టు నుంచి తిరుమలకు 50 విద్యుత్ బస్సులను నడుపుతుంది.
పరిపాలనా భవనం ఆధునీకరణ
– పరిపాలనా భవనానికి ఆధ్యాత్మికశోభ కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భవనం బాహ్య పరిసరాలను టెంపుల్ ఆర్కిటెక్చర్ తరహాలో తీర్చిదిద్దుతాం. కార్యాలయాలు చక్కటి అనుభూతిని ఇచ్చేలా ఉద్యోగులకు వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం.
పురాణాల ముద్రణ
– ధర్మప్రచారంలో భాగంగా అష్టాదశ పురాణాలను తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాం.
– ఇప్పటివరకు కూర్మమహాపురాణం, విష్ణుమహాపురాణం, బ్రహ్మమహా పురాణం, మత్స్యమహాపురాణం, అగ్నిమహాపురాణం(ప్రథమ భాగం), ఉత్తర హరివంశం(ప్రథమ, ద్వితీయ సంపుటాలు) ముద్రణ పూర్తయింది. మిగిలిన పురాణాల అనువాద పనులు ప్రముఖ పండితుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
విద్యాసంస్థలకు ఐఎస్‌వో సర్టిఫికెట్లు
– ఉన్నతమైన బోధన ప్రమాణాలు, నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అంశాలకు సంబంధించి టిటిడి ఆధ్వర్యంలోని 3 డిగ్రీ కళాశాలలు, 9 పాఠశాలలకు ఐఎస్‌వో సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఉద్యోగులకు స్మార్ట్‌కార్డులు
– సంక్షేమ చర్యల్లో భాగంగా ఉద్యోగులకు ఆర్‌ఎఫ్‌ఐడి(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) సాంకేతికతతో కూడిన స్మార్ట్ కార్డులతో పాటు ఫ్యామిలీ కార్డును అందించడం జరిగింది. ఈ పరిజ్ఞానం ద్వారా ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని స్మార్ట్ కార్డులో పొందుపరచడం జరిగింది. పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా స్మార్ట్‌కార్డు అందించాం.
కారుణ్య నియామకాలు
– మరణించిన 119 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు 90 రోజుల వ్యవధిలో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇచ్చాం. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న ఈ సమస్యను గతేడాది పరిష్కరించాం.
నగదు రహిత వైద్యం
– టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటుకు నిర్ణయించాం. ఇందుకు సంబంధించి పలు ఇన్సూరెన్స్ సంస్థలు, ఆసుపత్రులతో రేపు ఒప్పందం చేసుకోబోతున్నాం. ఫిబ్రవరి 1 నుంచి ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తాయి.
మ్యాన్‌పవర్ కార్పొరేషన్
– టిటిడిలో సొసైటీలు, ఏజెన్సీలు, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 7,260 మందికి ఉద్యోగభద్రత కల్పించడం కోసం ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శ్రీ లక్ష్మీశ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. దశలవారీగా వీరిని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతోంది.
టిటిడి, ఎస్వీబీసీ ధార్మిక కార్యక్రమాలు
– కోవిడ్ వైరస్‌ను నశింపచేయాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ ఆయా మాసాల్లో టిటిడి నిర్వహించిన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. లక్షలాది మంది భక్తులు వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ధనుర్మాస కార్యక్రమాలు
– తిరుమలలో శ్రీమాన్ పెద్దజీయంగార్ వారి సమక్షంలో, వారి మఠంలో ధనుర్మాసం 30 రోజులు కూడా ఆండాళ్ తిరుప్పావై పాశురాలను గానం చేస్తూ, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది భక్తులతో ఈ పాశురాలను పలికించి తెలుగులో వాటి తాత్పర్యాన్ని ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేశాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 208 కేంద్రాల్లో హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పండితులతో తిరుప్పావై ప్రవచనాలు వినిపించాం.
భగవద్గీత కంఠస్తం పోటీలు
– డిసెంబరులో గీతాజయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు, యువతకు భగవద్గీత కంఠస్త పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశాం.
అదివో అల్లదివో…
– అన్నమయ్య సంకీర్తనలకు భక్తిభావనను జనబాహుళ్యంలో విస్తృతప్రచారం కల్పించాలనే సత్సంకల్పంతో అదివో… అల్లదివో… పేరుతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు విడతల్లో కళాకారుల ఎంపిక కార్యక్రమం పూర్తయింది. మొత్తం 26 ఎపిసోడ్లతో ఈ కార్యక్రమం ఉంటుంది.
పారాయణ కార్యక్రమాలకు విశేష స్పందన
– ప్రపంచమానవాళికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న పారాయణ కార్యక్రమాలకు భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. హైందవ సాంప్రదాయాల పట్ల, సనాతన ధర్మం పట్ల యువతలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆయా మాసాలకు సంబంధించిన విశేష కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా ఎస్వీబీసీ ద్వారా ప్రసారం చేస్తాం. గతేడాది ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లు ప్రారంభించాం.
టిటిడిలోకి స్విమ్స్ విలీనం
– రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ ద్వారా స్విమ్స్‌ను టిటిడిలోకి విలీనం చేసింది.తద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం.
మరిన్ని ధార్మిక కార్యక్రమాలు
– కోవిడ్ పూర్తిగా తగ్గిపోయాక ప్రజలందరి భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించే ఆలోచన చేస్తున్నాం. కలియుగదైవమైన శ్రీవేంకటేశ్వరుడు యావత్ ప్రపంచానికి ఆరోగ్యం, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
టిటిడి అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు
గణతంత్ర వేడుకల్లో టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.
ఈ సందర్భంగా టిటిడి భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ విశ్వనాథం పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం ఉత్తమంగా విధులు నిర్వహించిన 25 మంది అధికారులకు, 150 మంది సిబ్బందికి ఈఓ ప్రశంసాపత్రాలు అందజేశారు. ముందుగా ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఎసిఏఓ శ్రీ బాలాజి, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ సురేష్ కుమార్, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విజిఓలు శ్రీ మనోహర్, శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.