SECOND DAY – CHINNA SESHA VAHANAM_ చిన్నశేషవాహనంపై శ్రీహరి చిద్విలాసం
The TTD has made elaborate seating arrangements on all the galleries of the sacred Mada Streets besides provision of public utilities like toilets, drinking water and also huge plasma Screens to give better views to all the audience.
చిన్నశేషవాహనంపై శ్రీహరి చిద్విలాసం
తిరుపతి, మార్చి 2, 2013 : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనంపై ఊరేగుతారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతికప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందునివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కల్యాణప్రదులై, సుఖశాంతులతో ఆనంద జీవులతారు.
కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు వీణ ధరించి సరస్వతీరూపంతో భక్తులను అనుగ్రహంచ నున్నారు. సారం లేనిదాన్ని వదలి, సారవంతమైన దాన్ని స్వీకరించే ఉత్తమజ్ఞానానికి హంస సంకేతం. జ్ఞానరూప పరమహంస అయిన కల్యాణ వేంకటేశ్వరుడు భౌతికరూపమైన హంసగా రూపొంది తన దివ్యతత్తాన్ని వెల్లడిస్తాడు. హంస సరస్వతికీ వాహనం. కనుక కల్యాణదేవుడు సరస్వతీరూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం. భక్తులు హంసల వలె నిర్మలమనస్కులై ఉంటే, వాళ్ల హృదయాల్లో తాను శాశ్వతంగా అధివసించి ఉంటానని ఈ వాహనం ద్వారా స్వామివారు సెలవిస్తున్నారు.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉదయం శ్రీ జి.రామచంద్రనాయుడు శ్రీ విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణం, శ్రీ జయరామి శెట్టి పురాణ ప్రవచనం, హైదరాబాదుకు చెందిన డి.విజయలక్ష్మి సంప్రదాయ భక్తి సంగీతం కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం గూడూరుకు చెందిన శ్రీ చదలవాడ వెంకటశేషయ్య ధార్మికోపన్యాసం, తిరుపతికి చెందిన శ్రీ కె.చంథ్రేఖర్‌బాబు హరికథ వినిపించారు. సాయంత్రం తాడేపల్లికి చెందిన శ్రీ మాతా శివచైతన్య ఆధ్యాత్మికోపన్యాసం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాధ్ అన్నమయ్య విన్నపాలు సంగీత కచేరి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, విజిఓ శ్రీ హనుమంతు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మణ్ నాయక్, తితిదే సూపరింటెండెంట్ ఇంజినీరు శ్రీ సుధాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శ్రీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.