SIMHA VAHANAM _ సింహ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం
సింహ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం
తిరుపతి, మార్చి 13, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.
వాహన సేవ అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై రాములవారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు మహతి కళాక్షేత్రంలో, శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ ఆధ్వర్యంలో ”వేదమే ధర్మ మూలం” పేరుతో వేదగొష్టి జరుగనుంది. అలాగే శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద శ్రీమతి కోగంటి రంగనాయకి దాశరథి శతకాన్ని ఆలపించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్ స్వామి, తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఏఈఓ శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.