SRI PADMAVATHI AMMAVARI TEPPOTSAVAMS FROM JUNE 25 TO 29 _ జూన్ 25 నుండి 29 వరకు వైభవోపేతంగా శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
Tirupati, June 14, 2026: The annual Teppotsavams of Sri Padmavathi Ammavari at Tiruchanoor will be held grandly from June 25 to 29.
Every day from 6.30 p.m. to 7.30 p.m., the Goddess will bless devotees with a celestial boat ride in the sacred Padma Sarovaram.
On June 25, Sri Krishna Swamy with Rukmini and Satyabhama will grace the Teppotsavam, followed by Sri Sundararaja Swamy on June 26. Sri Padmavathi Ammavaru will participate on the remaining three days.
Snapana Tirumanjanam will be conducted from June 27 to 29. Gaja Vahana Seva and Garuda Vahana Seva will be held on June 28 and 29 respectively.
Devotional, spiritual, musical and cultural programmes will be organised daily. TTD has appealed to devotees to participate in large numbers and receive the divine blessings of Sri Padmavathi Ammavaru.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 25 నుండి 29 వరకు వైభవోపేతంగా శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
పద్మసరోవరంలో భక్తులను అనుగ్రహించనున్న అలమేలుమంగ తల్లి
భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుచానూరులో ఆధ్యాత్మిక శోభ
తిరుపతి, 2026 జూన్ 14: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు పద్మసరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ అలమేలుమంగ తల్లి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
పాంచరాత్ర ఆగమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మసరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకుని భక్తజనులను కటాక్షించనున్నారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరిగే ఈ తెప్పోత్సవాల్లో పాల్గొనడం ద్వారా భక్తుల కష్టాలు, సంసార బంధనలు తొలగి దైవానుగ్రహం, సర్వసౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణ ప్రాశస్త్యం.
పద్మసరస్సులోని బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన శ్రీ పద్మావతి అమ్మవారు జగజ్జననిగా భక్తులను భవసాగరంలో మునిగిపోకుండా రక్షించి మోక్షమార్గాన్ని ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు చాటిచెబుతాయి.
ఉత్సవాల విశేషాలు
జూన్ 25: రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం
జూన్ 26: శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవం
జూన్ 27 నుండి 29 వరకు: శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం
చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
అలాగే జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడవాహన సేవ వైభవంగా జరుగనున్నాయి. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
తెప్పోత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అలాగే జూన్ 26న జరిగే లక్ష్మీపూజలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచనున్నారు.
అలమేలుమంగ తల్లి దివ్య కటాక్షం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ కోరుతోంది.
