SRI PADMAVATI AMMAVARI RATHOTSAVAM HELD _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం
Tirupati, 17 November 2023: On the eighth day of the ongoing annual Karthika Brahmotsavam of Tiruchanoor temple grand Rathotsavam fete was held on Friday.
As the ratham glided along the mada streets with rich decorations, Sri Padmavati Devi blessed devotees in all Her religious splendour assuring the devotees on the fulfilment of their appeals.
Both Tirumala pontiffs, TTD Chairman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy, Chandragiri MLA De Bhaskar Reddy, JEO Sri Veerabrahmam and other officials were also present.
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం
తిరుపతి, 2023 నవంబరు 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం రథోత్సవం కన్నులపండుగగా జరిగింది.
ఉదయం 8.40 గంటలకు రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.
రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.
రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
రథోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మా రెడ్డి, జేఈవో శ్రీ వీర బ్రహ్మం, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ-3 శ్రీ సత్యనారాయణ ,ఈఈలు శ్రీ మనోహర్, శ్రీ నరసింహ మూర్తి , విఎస్వో శ్రీ బాలి రెడ్డి, , ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్ ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.