SRI PRASANNA VENKATESWARA SWAMY CHAKRASNANAM HELD GRANDLY _ వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

Tirupati, July 3, 2026: The Chakra Snanam marked the grand conclusion of the annual Brahmotsavams of Sri Prasanna Venkateswara Swamy Temple on Friday. 

The sacred ritual was performed in the temple Pushkarini following Snapana Tirumanjanam, with priests, TTD officials and a large number of devotees participating.

The Brahmotsavams will conclude with Dhwajavarohanam between 7.00 p.m. and 7.30 p.m. on Friday.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

రాత్రి ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2026 జూలై 03: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.

అంతకుముందు ఉదయం 7.15 నుండి 8.45 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం ఉద‌యం 10.45 గంట‌ల‌కు చ‌క్ర‌స్నానం ఘ‌నంగా జ‌రిగింది.

ముందుగా కంకణ బట్టార్ శ్రీ  సూర్య కుమార్ ఆచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్ర‌స‌న్న‌ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తులు , దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

లోకం క్షేమం

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికి , భక్తులు సుఖశాంతులతో ఉండడానికి – చక్రస్నానం నిర్వహించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు.

సాయంత్రం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది.

వాహ‌న సేవ‌లో ఆల‌య ఒంగోలు ఎంఎల్ఏ శ్రీ దామచర్ల జనార్దన్ రావు, డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఏఈవో శ్రీ దేవ‌రాజులు, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ వేణుగోపాల్, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.