SRI VEDANARAYANA SWAMY ON SURYAPRABHA VAHANAM _ సూర్యప్రభ వాహనంపై తేజోవంతంగా శ్రీ వేదనారాయణ స్వామి

Tirupati, May 07, 2026: As part of the annual Brahmotsavams at Sri Vedanarayana Swamy Temple, Sri Vedanarayana Swamy blessed devotees on Surya Prabha Vahanam on Thursday morning.

 The procession was held grandly through the four Mada streets amid Govinda chants and devotional fervour.

Snapana Tirumanjanam was also performed to the utsava deities with milk, curd, honey, turmeric and sandal paste. Chandraprabha Vahanam will be held at 7.30 pm.

On May 8, the grand Rathotsavam will take place at 6.25 am, followed by Kalyanotsavam from 4.30 pm to 6.30 pm. Ashwa Vahanam will be held at 7.30 pm.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

సూర్యప్రభ వాహనంపై తేజోవంతంగా శ్రీ వేదనారాయణ స్వామి

మే 8 వైభవంగా రథోత్సవం, కల్యాణోత్సవం

తిరుపతి, 2026 మే 07: నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవ ఆలయ నాలుగు మాడ వీధుల్లో అత్యంత వైభవంగా సాగింది. గోవింద నామస్మరణల మధ్య భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందారు.

సకల లోకాలకు తేజస్సును ప్రసాదించే సూర్యభగవానుని ప్రతీకగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వడం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. సకల జీవరాశులకు ప్రాణాధారమైన సూర్యుని మహిమను ప్రతిబింబించేలా ఈ వాహనసేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకాలు నిర్వహించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులు, శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మే 8 రథోత్సవం, కల్యాణోత్సవం

బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 6.25 గంటలకు శ్రీ వేదనారాయణస్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. మహారథంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అదేవిధంగా సాయంత్రం 4.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.