SRI VENUGOPALA SWAMY BLESSES DEVOTEES ON PEDDASESHA VAHANAM _ శ్రీదేవి–భూదేవి సమేత శ్రీనివాసునిగా గోకులానందుడు
Tirupati, June 06, 2026: As part of the annual Brahmotsavams of Sri Rukmini-Satyabhama Sametha Sri Venugopala Swamy at Karvetinagaram, the first day’s Pedda Sesha Vahana Seva was held grandly on Saturday night.
Sri Venugopala Swamy, adorned as Sri Srinivasa Swamy along with Sridevi and Bhudevi, was taken in a majestic procession on Pedda Sesha Vahanam through the four Mada Streets amidst devotional chanting of “Govinda” and traditional cultural performances.
The Vahana Seva signifies the spirit of selfless service and devotion represented by Adisesha.
On June 07, Chinna Sesha Vahana Seva will be held in the morning and Hamsa Vahana Seva in the evening.
Temple officials, priests, Srivari Sevaks, and a large number of devotees participated in the event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీదేవి–భూదేవి సమేత శ్రీనివాసునిగా గోకులానందుడు
పెద్దశేషునిపై దివ్య విహారం…
గోవింద నామస్మరణలతో పులకించిన కార్వేటినగరం
తిరుపతి, 2026, జూన్ 06: కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణీ–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు శనివారం రాత్రి జరిగిన పెద్దశేష వాహనసేవ భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకరణలో దివ్యమంగళ విగ్రహంగా వెలసిన శ్రీ వేణుగోపాలస్వామివారు పెద్దశేష వాహనంపై విహరించి భక్తులను ఆశీర్వదించారు.
మంగళవాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనల నడుమ దివ్య విహారం
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనలు, గోవింద నామసంకీర్తనల మధ్య స్వామివారు అమ్మవార్లతో కలిసి నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం అందించారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు సమర్పించి, కర్పూర హారతులు ఇస్తూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవించుకున్నారు.
నిత్యసేవా తత్వాన్ని చాటే పెద్దశేష వాహనం
స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం అన్నీ తానే అయి నిత్యసేవలో తరించే ఆదిశేషుని మహిమను పెద్దశేష వాహనం ప్రతిబింబిస్తుంది. శేషుని వలె భగవంతునికి అంకితభావంతో సేవ చేస్తూ ధర్మమార్గంలో నడిచే భక్తులను స్వామివారు ఎల్లప్పుడూ కాపాడుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ ద్వారా అందిస్తారు.
జూన్ 07న చిన్నశేష, హంస వాహన సేవలు
జూన్ 07న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై శ్రీ రుక్మిణీ–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గోపాలాచార్యులు, కంకణ బట్టార్ శ్రీ మురళీకృష్ణ స్వామి, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎస్. చెంగల్‌రాయులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
