SRIVARI KALYANAM MARKS GRAND START OF ANNAMACHARYA JAYANTHI _ అన్నమయ్య కీర్తనల మధ్య శ్రీవారి దివ్య కల్యాణ మహోత్సవం

Tallapaka / Tirupati, May 02, 2026: The 618th birth anniversary celebrations of Saint Tallapaka Annamacharya began grandly at Tallapaka on Saturday.

Srivari Kalyanam was performed in a devotional atmosphere at the Dhyanamandiram with Vedic rituals and chanting. Earlier, group rendition of Annamayya Sankeertanas enriched the spiritual ambience.

Devotees participated in large numbers and were served prasadam.

Upcoming Music concert, Harikatha, and Unjal Seva at the 108-ft Annamayya statue are scheduled in the evening.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

అన్నమయ్య కీర్తనల మధ్య శ్రీవారి దివ్య కల్యాణ మహోత్సవం

గోవింద నామస్మరణతో మారుమోగిన తాళ్లపాక

భక్తి వైభవంతో ప్రారంభమైన అన్నమయ్య జయంతి ఉత్సవాలు

తాళ్లపాక / తిరుపతి, 2026 మే 02: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం శ్రీవారి దివ్య కల్యాణం కన్నులపండువగా జరిగింది.

ఉదయం 10 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను కల్యాణవేదికకు తీసుకువచ్చారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యాహవచనం, పవిత్ర హోమం, కంకణధారణ, మాంగళ్యధారణ, మంగళాశాసనం వంటి ఘట్టాలతో కల్యాణం వైభవంగా జరిగింది. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతులతో కార్యక్రమం ముగిసింది.

టీటీడీ భక్తులకు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు అందించగా, అనంతరం పెద్దసంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.

అంతకుముందు ఉదయం 9 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లారు.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు చెన్నైకు చెందిన డా. తాళ్లపాక మీనలోచని సంగీత సభ, రాత్రి 7.30 గంటలకు కర్నూలుకు చెందిన శ్రీమతి లక్ష్మీ మహేష్ బృందం హరికథ గానం నిర్వహించనున్నారు.

అన్నమయ్య విగ్రహం వద్ద ఊంజల్ సేవ వైభవం

రాజంపేట–కడప రహదారిపై ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద శనివారం సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు శ్రీవారి ఊంజల్ సేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలను ఆలపించనున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ రమణయ్య బృందం హరికథ కార్యక్రమం నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది