SUNDARARAJA UTSAVAMS COMMENCES _ వైభవంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 20 JUNE 2022: The Avatara Mahotsavams in Sri Sundararaja Swamy temple, a sub-temple of Tiruchanoor Padmavathi Ammavaru temple commenced on a grand religious note on Monday.
After special Abhishekam was performed in Sri Krishna Mukha Mandapam in the morning, Unjal Seva was performed in the evening.
In the night Pedda Sesha Vahana Seva took place.
Deputy EO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
వైభవంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2022 జూన్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, తోమాల సేవ నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్ సేవ నిర్వహిస్తారు. అనంతరం వాహనమండపంలో శ్రీ సుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై వేంచేపు చేస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. కాగా మంగళవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం :
శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు (ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.