TARIGONDA VENGAMAMBA – A SYMBOL OF DEVOTION, KNOWLEDGE AND YOGA _ భక్తి–జ్ఞానం–యోగానికి ప్రతిరూపం తరిగొండ వెంగమాంబ : ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి శ్రీదేవి
Tirupati, April 30, 2026: The 296th Jayanthi celebrations of Tarigonda Vengamamba concluded grandly in a devotional atmosphere at Annamacharya Kalamandiram, Tirupati.
Eminent litterateur Smt. Sridevi stated that Vengamamba’s life reflected a perfect blend of devotion, wisdom, and yogic practice, dedicated entirely to Lord Venkateswara.
Scholars highlighted her literary greatness and spiritual legacy during the seminar. Cultural and devotional programs added spiritual fervour to the event.
Floral tributes were paid to her statue in Tirupati, while special rituals and cultural events were also held at Tarigonda.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తి–జ్ఞానం–యోగానికి ప్రతిరూపం తరిగొండ వెంగమాంబ : ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి శ్రీదేవి
ఘనంగా ముగిసిన 296వ జయంతి ఉత్సవాలు
తిరుపతి, 2026 ఏప్రిల్ 30: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి, జ్ఞానం, యోగసాధనల సమన్వయంగా వెలుగొందిన మహనీయురాలని ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి శ్రీదేవి పేర్కొన్నారు. ఆమె జీవితం సంపూర్ణంగా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తికి అంకితమై, ఆత్మసాక్షాత్కారానికి మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం నిర్వహించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలు భక్తి వాతావరణంలో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన సాహితీ సదస్సులో పండితులు వెంగమాంబ జీవితం, సాహిత్య విశిష్టతపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు.
ఈ సందర్భంగా “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ యోగ జీవనం” అనే అంశంపై శ్రీమతి శ్రీదేవి మాట్లాడుతూ, వెంగమాంబ రచనలు సమాజంలోని లోపాలను ప్రశ్నిస్తూ నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఆమె జీవితం భక్తి, తపస్సు, ఆత్మసాక్షాత్కారానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం సహాయాచార్యులు డా. సుభాషిని మాట్లాడుతూ, వెంగమాంబ రచించిన “చెంచు నాటకం”లో స్త్రీ ఔనత్యం ప్రతిఫలిస్తుందని తెలిపారు. స్త్రీలోని ధైర్యం, స్వాభిమానం, సమానత్వ భావాలను వెంగమాంబ తన రచనల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారని చెప్పారు.
మనస్తత్వ పరిశోధకులు డా. బాలాజీ దీక్షితులు మాట్లాడుతూ, వెంగమాంబ రచనలు భక్తి, భావోద్వేగం, ఆత్మానుభూతి సమన్వయంగా ఉండి భక్తిని పెంపొందిస్తాయని వివరించారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.
వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి
తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి శ్వేత ఇన్‌చార్జ్ సంచాలకులు శ్రీమతి సువర్ణమ్మ పుష్పాంజలి ఘటించారు.
తరిగొండలో ప్రత్యేక కార్యక్రమాలు
తరిగొండలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం సంగీత సభ, హరికథ కార్యక్రమాలు నిర్వహించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది






