TEAM OF TTD OFFICIALS VISIT TO MOUNT ABU- STUDY TOUR _ మౌంటు అబూలోని బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయంను సందర్శించిన టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
మౌంటు అబూలోని బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయంను సందర్శించిన టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
తిరుపతి, ఏప్రిల్-16, 2008: తి.తి.దే., కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారిగారు ఆదేశాల మేరకు తి.తి.దే., అధికారుల బృందం రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంటు అబూను సందర్శించింది. ఈ బృందంలో శ్వేత డైరక్టర్ శ్రీ భూమన్, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ శాస్త్రి, అసిస్టెంట్ పి.ఆర్.ఓ. శ్రీ టి.రవి లు ఉన్నారు.
బుధవారం ఉదయం మౌంట్ అబూలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అడిషనల్ చీఫ్ దాది అయిన ఇరదైమౌని గారిని కలిసి బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవులు ఎప్పుడూ ఆనందాన్ని ఇతరులకు పంచుతూ ఉండడం ద్వారా నిత్యం మరింత ఆనందాన్ని పొందవచ్చునని అదేవిధంగా మానవుడు కోల్పోతున్న ఆథ్యాత్మికతను, విలువలను నేర్పుతున్నామని తద్వారా వారు మానవజీవితము యొక్క పరమార్థమును గురించి అవగాహన చెందుతున్నారని చెప్పారు. దాది గారు తిరుమల గురించి మాట్లాడుతూ అదొక పవిత్ర పుణ్యక్షేత్రమని, స్వామివారిని దర్శించు కోవడానికి వచ్చే భక్తకోటికి తి.తి.దే., చేస్తున్న సేవలు అద్భుతమైనవని చెప్పారు. తిరుమలకు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు రావడం వారికి అదే స్థాయిలో సేవలు చేస్తుండడం ఎంతో శ్లాఘనీయమని తెలిపారు.
ఈ సందర్భంగా దాదిగారికి తి.తి.దే.,లో పలు కార్యక్రమాలను భక్తులకు కల్పిస్తున్న పలు సౌకర్యాలను గురించి ఆమెకు వివరించడం జరిగింది. తిరుపతిలోని శ్వేతానందు ఉద్యోగులకు పలువిషయాలపై ఇస్తున్న శిక్షణా కార్యక్రమములో బాగంగా ఆథ్యాత్మిక, మానవీయ విలువలకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలని వారిని ఆహ్వానించడమైనది. అదే విధముగా తిరుమలలో భక్తులకు సేవలందించడానికి గాను బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయము నుండి సేవకులు పంపాలని, తి.తి.దే. ప్రచురించే పుస్తకాలను, క్యాసెట్లను, సీ.డీలను సైతం కార్యాలయం నందు అందరికి అందుబాటులో వుంచాలని కోరడం జరిగింది. పిదప తి.తి.దేకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ నందు పలు విషయాలపై ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయాలని కోరగా వారు ఎంతో ఆనందంతో సమ్మతించడం జరిగింది. తిరుపతి రైల్వేస్టేషన్, ఆసుపత్రులు ఇతర తి.తి.దే. సంస్థలలోని భక్తులకు ఉచిత సేవలు అందించడానికి మౌంట్-అబూ నుండే కాక దేశవ్యాప్తంగా వున్న బ్రహ్మకుమారీస్ సేవలకులను బృందాలుగా శ్రీవారిసేవకు పంపడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని వారు తెలిపారు. ప్రస్తుత ఇ.వో. శ్రీ కె.వి.రమణాచారి ఆదేశం మేరకు చరిత్రలో మొదటిసారిగాబ్రహ్మకుమారీ సేవకులను ‘శ్రీవారిసేవ’కులుగా రమ్మని ఆహ్వానించగానే, అంగీకరించడం ఒక గొప్ప పరిణామం. వీరు ఇక బృందాలుగా శాశ్వత ప్రాదిపదికన శ్రీవారిసేవకు తిరుమలకు రానుండం ఒక గొప్ప విశేషం.
అనంతరం బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం చేస్తున్న పలు సేవాకార్యక్రమాలను, నడుపుతున్న పలు సంస్థలను తి.తి.దే. అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వేలాదిమందికి చపాతీలు, అన్నం తయారుచేయడం, భక్తులకు వడ్డించడం పరిశీలించడమైనది. అదే విధంగా ఆరోగ్యవిభాగం, సర్వీసువిభాగం, రక్షణ విభాగం, విద్యావిభాగం, కల్చరల్ విభాగం, ఇంజనీరింగ్ ట్రాన్స్‌పోర్టు, వైద్య విభాగాలు, ఫోటోగ్రఫీ, ఆడియో, వీడియో విభాగాలు, ప్రచురణల విభాగం, ముద్రణాలయం, రిసెప్షన్ తదితర విభాగాల పనితీరును ప్రత్యక్షంగా అధికారులు పరిశీలించారు. అనంతరం వీటిపై ఒక సమగ్ర నివేదకను తయారుచేసి కార్యనిర్వహణాధికారిగారికి సమర్పించడం జరుగుతుంది. తద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి వీలుంటుంది. అంతకుముందు దాదాగారికి శ్రీవారి వస్త్రము, ప్రసాదాలు అందజేయడం జరిగినది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.