“TEMPLE MANAGEMENT BY TTD IS A ROLE MODEL IN THE WORLD:-TTD EO _ న్యూఢిల్లీ శ్రీవారి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభంప్రపంచంలోనే తితిదే ఆలయ పరిపాలన వ్యవస్థ ఆదర్శనీయం : ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
ప్రపంచంలోనే తితిదే ఆలయ పరిపాలన వ్యవస్థ ఆదర్శనీయం : ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, మే 28, 2013: కలియుగ ప్రత్యక్షదైవంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించే తిరుమల తిరుపతి దేవస్థానములు(తితిదే) గత 80 సంవత్సరాలుగా స్వామివారి అద్వితీయ వైభవాన్ని చాటుతూ ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఉద్ఘాటించారు.
ఢిల్లీలోని ఆంధ్రా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్వహణ, భక్తులకు దర్శనం, బస వసతులు కల్పించడమే గాకుండా హైందవ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఎన్నో ధార్మిక, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి, శుభప్రదం, సదాచారం, యువలయం, సౌభాగ్యం, ప్రహ్లాదం లాంటి కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యువతలో మానవీయ, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ”శుభప్రదం” వేసవి శిక్షణ తరగతులకు విశేష స్పందన లభించిందన్నారు. ఈ తరగతుల అవసరాన్ని గుర్తించిన మారిషస్ దేశం ఆహ్వానం మేరకు ఇటీవల తితిదే అధికారుల బృందం అక్కడ పర్యటించి ”శుభప్రదం” నిర్వహణకు సహకారం అందించినట్టు వివరించారు.
ఆరేళ్ల క్రితం ప్రారంభమైన శ్రీనివాస కల్యాణాలు నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయన్నారు. ప్రారంభంలో కుగ్రామాలు, ఏజన్సీ ప్రాంతాలకే పరిమితమైన శ్రీనివాస కల్యాణాలను నేడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గతేడాది దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే కాకుండా నేపాల్, యుఎస్‌ఏ, కెనడా, యుకె వంటి దేశాల్లో సైతం శ్రీనివాస కల్యాణాలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. నేపాల్‌లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణానికి ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారంటే అతిశయోక్తి కాదన్నారు. శ్రీనివాస కల్యాణాలు జరిగే ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయని ఆ ప్రాంతవాసులే తమకు సమాచారం అందిస్తున్నట్టు తెలిపారు.
జూన్ 1న సాయంత్రం ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల మైదానంలో నిర్వహించనున్న శ్రీనివాస కల్యాణంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ప్రస్తుతం బుధవారం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి 16 ఏళ్ల క్రితం అప్పటి కేంద్ర ప్రభుత్వం చొరవతో ప్రధానమైన గోల్ మార్కెట్ ప్రాంతంలో 1.177 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అన్ని విశ్వాసాలు గలవారు ఆసక్తి చూపుతున్నట్టు తెలిపారు. నూతనంగా ప్రారంభం కానున్న ఆలయంలో స్వామివారి దర్శనభాగ్యం పొంది భక్తులు తరించాలని ఈవో కోరారు. ఆలయం పక్కనే ధ్యానమందిరాన్ని కూడా నిర్మించామని, ఇందుకు గాను పారిశ్రామివేత్త నిర్మిల్ సేథియ రూ.2 కోట్లు విరాళం అందించినట్టు తెలిపారు. అక్కడే తితిదే సమాచార కేంద్రాన్ని, ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని, ఆసక్తి గలవారికి సంగీతం, సంప్రదాయ నృత్యాన్ని నేర్పించే విశాలమైన గదులు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
విలేకరుల సమావేశంలో సేథియ కంపెనీ ఎం.డి శ్రీ జైన్, ఢిల్లీ స్థానిక నిర్వహణ కమిటీ అధ్యకక్షుడు శ్రీ శ్రీవత్స పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.