THE PRIDE OF OUR COUNTRY LIES IN PRESERVING SANATANA DHARMA-TTD EO _ కార్యనిర్వహణాధికారి గారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
కార్యనిర్వహణాధికారి గారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
తిరుపతి, 2012 ఆగస్టు 15: ”వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన” అని ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో విధుల్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తున్న సిబ్బందికి, శ్రీ స్వామి సేవలో తరించి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు, భావిభారత నిర్మాతలైన విద్యార్థినీ విద్యార్థులకు, దేవస్థానం పాలకమండలి వారికి, శ్రీవారి భక్తిపారవశ్యంలో పునీతులౌతున్న భక్తులకు 66వ స్వాతంత్య్ర దినోత్సవ శుభసందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ఎందరో వీరుల త్యాగఫలంగా, ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఈ స్వాతంత్య్రం సిద్ధించింది. ఈ శుభదినాన ఆ మహానుభావులందరినీ స్మరించుకోవడం మన బాధ్యత. కనీస కర్తవ్యం.
కాషాయం :- సాధు సద్గురువులు, మహర్షులు ధరించే వస్త్రాల వర్ణం కాషాయం.
శ్వేతవర్ణం:- శ్వేతవర్ణం నిర్మలత్వానికి, నిష్కల్మషత్వానికి, శాంతిసౌభాగ్యానికి ప్రతీకలు.
హరితవర్ణం :- హరిత వర్ణం సస్యశ్యామలత్వానికి, అన్నపూర్ణత్వానికి ప్రతీక.
త్రివర్ణ పతాకం మధ్యన నిలిచిన ధర్మచక్రం ధర్మ సంస్థాపనకు ప్రతీక. ఇంతటి సనాతన ధర్మాలను పుణికి పుచ్చుకొన్న త్రివర్ణ పతాకాన్ని ఈవాళ మనం గౌరవించుకుంటున్నాం.
ఆర్ష సంస్కృతికి ఆలవాలమైన ఈ పుణ్యభూమిలో జన్మించడం, అందునా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి అతిపెద్ద ధార్మిక సంస్థలో పనిచేయడం మనందరి పూర్వజన్మ సుకృతం.
భక్తుల సౌకర్యాలు, భక్తి ప్రచారమే మన ధ్యేయం అయినా ఆప్తులను, అభాగ్యులను ఆదుకొనే ప్రజాసంక్షేమ కార్యక్రమాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానము పెద్ద ఎత్తున చేపట్టిందని తెలియజేస్తున్నాను. వాటి వివరాలు ప్రసార మాధ్యమం ద్వారా ఎప్పటికప్పుడు వివరించుకుంటూ అమలులో సవరించుకొనుట ముదావహం.
– భారతీయులకు గోవు ఇలవేల్పు. అందుకే ‘గోమాత’ అని పిలుచుకుంటాం. సకల దేవతలకు నెలవైన గోమాతలను మనం సంరక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో తితిదే గోసంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించింది. అంతేకాకుండా భారత రాజ్యాంగం ప్రత్యక్షంగా గోవధ నిషేధ చట్టాన్ని కూడా రూపొందించింది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో ఒక గోసంరక్షణశాలను నిర్మించి గోమాతలను సంరక్షించడానికి తితిదే కృతనిశ్చయంతో ఉందని తెలియజేస్తున్నాను.
– భావిభారత పౌరులైన విద్యార్థులకు భారతీయ హైందవ సనాతన ధర్మ సంస్కృతి, సంప్రదాయ విలువలు నేర్పడంలో భాగంగా 2012, మే 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు ”శుభప్రదం” పేరిట వేసవి శిక్షణ తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాము. దాదాపు మూడు వేల మంది విద్యార్థులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొని నిష్ణాతులైన గురువుల నుండి భారతీయ ధర్మం, మనోవికాసం గురించి తెలుసుకోవడం జరిగింది.
– భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మరిచిపోతున్న నేటి సమాజంలో మన సంస్కృతిపై మక్కువ పెంచి దేవాలయాలను కాపాడుకునే బాధ్యతను పౌరులలో పెంచేందుకు తితిదే, రాష్ట్ర దేవాదాయ శాఖతో కలిసి భారీ ఎత్తున ”మనగుడి” ఉత్సవాన్ని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 13,773 ఆలయాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 66 లక్షల మంది భక్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాలను శుద్ధి చేసుకోవడం, భజనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, దేవతామొక్కల నాటడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచిన రక్షాకంకణాలను భక్తులందరూ ధరించారు.
– వైదిక సంస్కృతి పునరుద్ధరణకై దేశవిదేశాల్లో తితిదే హైందవ జాగృతిని కల్పించే భజనలు, పురాణపఠనాలు, ప్రవచనాలు, గోవిందకల్యాణాలు, శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నది. శ్రీనివాస కల్యాణాలు జరిగే ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుకనే దేశంలోనే ప్రతి ప్రాంతంలోను శ్రీనివాస కల్యాణాలు జరిపి దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షించడం జరిగింది. ఇందులో భాగంగా ”శ్రీ కల్యాణ మహోత్సవ ప్రాజెక్టు” పేరున ఒక ప్రాజెక్టును ఏర్పాటుచేసి, వార్షిక ప్రణాళికలను రూపొందిస్తున్నది. శ్రీనివాస కల్యాణాలలో భాగంగా 100వ కల్యాణోత్సవాన్ని ఇటీవల కొల్హాపురంలో వైభవంగా నిర్వహించిందని తెల్పుటకు సంతోషిస్తున్నాను.
– కర్ణాటక సంగీతంలో సరికొత్త ప్రయోగాలు చేసి తెలుగునాట సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన డాక్టర్ శ్రీపాద పినాకపాణి శత వసంతంలోకి అడుగిడిన సందర్భంగా తితిదే రూ.10 లక్షల చెక్కును అందజేసింది. అలాగే గాన విద్యావారధి అనే బిరుదును, సన్మానపత్రాన్ని ప్రదానం చేశామని తెలియజేస్తున్నాము.
– ”ధర్మో రక్షతి రక్షితః” అన్న గీతావాక్యాన్ని అనుసరించి తితిదే హైందవ ధర్మ పరిరక్షణ కోసం ధర్మ ప్రచారానికి నెలవైన శ్రీవారి ఆలయాలను దేశంలోని ప్రధాన ప్రాంతాలలో ముఖ్యంగా కన్యాకుమారి, కురుక్షేత్రం, డెహ్రాడూన్ వద్దగల రాజపూర్ మొదలైన ప్రాంతాలలో నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తూంది. అంతేకాక దేశ రాజధాని అయిన ఢిల్లీలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తూ శ్రీరామ నవమి నాటికి ప్రజలకు అందుబాటులోనికి వస్తూందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.
– విద్యార్థిని విద్యార్థులకు సరస్వతి కటాక్షం కలగాలని ”సరస్వతీయాగం”, దేశానికి వెన్నెముక అయిన రైతన్నల శ్రేయస్సు కోసం ”కారీరీష్టియాగం”ను నిర్వహించడం జరిగింది.
– తిరుమలకు విచ్చేసే భక్తులు అందరూ సందర్శించి స్వామి వైభవ విశేషాలను తెలుసుకునేందుకు వీలుగా మ్యూజియాన్ని ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటు న్నట్టుగా తెలియజేయడమైనది.
– స్థానిక ఆలయాల్లో వివిధ అభివృద్ధి పనులు చేసి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది భక్తులు స్థానిక ఆలయాలను సందర్శించేందుకు కృషి చేస్తున్నట్టు తెలియజేస్తున్నాను.
– తిరుమలలో నిర్వహిస్తున్న శ్రీవారి సేవ పథకాన్ని తిరుపతికి కూడా విస్తరించి రానున్న రోజుల్లో ఎక్కువ మంది శ్రీవారి సేవకులను ఇటు తిరుపతిలోను, అటు తిరుమలలోను వినియోగించుకోవడానికి కృషి చేస్తున్నాము.
– తితిదేలో భక్తులకు అందుతున్న సౌకర్యాలకు సంబంధించి మెరుగైన సేవలను వేగవంతంగా అందించే ఉద్దేశంతో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజిని బాగా వినియోగించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాము.
– తితిదే సిబ్బంది కాకుండా ఇతర భక్తులు కూడా శ్రీవారి సేవగా పరకామణి సేవలో పాల్గొనే అవకాశాన్ని ఇటీవలే కల్పించింది. అంటే ఈ ఆగస్టు నెలలోనే దక్షిణాది రాష్ట్రాలలోని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులచే ఈ పరకామణి సేవ ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాను.
– అన్ని వర్గాల వారు తమ తమ ఇష్టదైవాలను ఆరాధించుకొనేందుకు, అర్చించు కొనేందుకు తద్వారా అధ్యాత్మిక చింతనను పరిపుష్టం చేసుకొనేందుకు అన్ని వర్గాల వారికి తితిదే అర్చకత్వ శిక్షణను ఉచితముగా ఇస్తున్నది. సనాతన హైందవ ధర్మాన్ని బలపరుస్తూ అన్ని వర్గాల వారు తమ తమ ఆలయాల్లో అర్చకత్వాన్ని నెరుపుకొనేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నది.
– తితిదే ఉద్యోగస్తులు కేవలం కార్యాలయాల వరకే పరిమితం కాకుండా శ్రీవారి భక్తులను, తద్వారా శ్రీవారిని సేవించుకొనే అవకాశాన్ని కల్పించింది. ప్రత్యేకించి మహిళామణులకు ప్రతి మంగళవారం శ్రీవారి భక్తులను సేవించుకొనే అవకాశాన్ని కల్పించింది. సామాజిక సేవలో భాగంగా తితిదే ఉద్యోగులు రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటుచేసి తమ సేవాతత్పరతను చాటుకుంటున్నారు. అహరహం భక్తుల సేవలో తరించే తితిదే ఉద్యోగస్తుల శ్రేయస్సు కోసం తితిదే విశేష కృషి చేస్తున్నదని తెలియజేస్తున్నాను.
– హైందవ మతానికి మూలకందాలైన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సంహితాలను అర్థ, తాత్పర్య, వ్యాఖ్యానాలతో సహ ప్రచురించి ప్రజలకు అందుబాటులోనికి తెస్తున్నది. అందులో భాగంగా ప్రతి జిల్లాలోను ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాలను నెలకొల్పేందుకు తితిదే విశేష కృషి చేస్తున్నది. ఇందుకు గాను ప్రాచీన గ్రంథాల సేకరణలో తితిదే ప్రజా సహకారాన్ని కూడా కోరుతోంది.
– శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన, లభించిన 12 వేల సంకీర్తనల రాగి, తాళపత్రాలను అత్యాధునిక సాంకేతిక శాస్త్రీయ పద్ధతులలో భద్రపరచి అందులోని సంకీర్తనలను దక్షిణ, ఉత్తరాది భాషలతో పాటు ఆంగ్లంలో కూడా ముద్రించి భావితరాలకు అందించే సదుద్ధేశ్యముతో పురావస్తు ప్రదర్శనశాలలో ప్రదర్శించడం జరిగింది.
– ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సనాతన హిందూధార్మిక పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులకు శ్రీవారి ఆశీస్సులు అందాయి.
– ఎంపిక చేసిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే తితిదే ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు నిర్ణయం.
– తిరుమలలో ఇటీవల ప్రవేశపెట్టిన అన్యమతస్తుల డిక్లరేషన్‌కు అనూహ్య స్పందన వస్తోంది.
– తితిదే ఆరోగ్యశాఖకు అంతర్జాతీయ అవార్డు రావడం అభినందనీయం. ఇందుకు కృషి చేసిన ఆ శాఖ అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
– తితిదేలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వీలైనంత మేర వేతనాలను పెంచడం జరిగింది.
– గోవిందం పరమానందం అనే కార్యక్రమం ద్వారా స్వామివారి సేవలను శ్రీ వేంకటేశ్వర భక్తిఛానల్ ద్వారా భక్తులందరికీ చూపించాలనే ఆశయంతో 2011, జనవరి 30న రథసప్తమి పర్వదినం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. తద్వారా లక్షలాది కరపత్రాలు, పుస్తకాలను ప్రతి గ్రామంలోని ప్రజలకు అందజేసేందుకు కృషి జరుగుతోంది. కనుక భక్తులు ఈ సదవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారమయ్యే స్వామివారి సేవలను వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాను.
60 వసంతాల ‘పద్మావతి’లో ఘనంగా 66వ స్వాతంత్య్ర దినోత్సవం
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో 66వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సుజాత మాట్లాడుతూ కళాశాల ఘన చరిత్రను తెలియజేశారు. యావత్ భారతావనికి స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 5 సంవత్సరాలకు అంటే 1952 ఆగస్టు 11వ తారీఖున అత్యున్నత ప్రమాణాలతో తొలి మహిళా డిగ్రీ కళాశాలగా ఆవిర్భవించిన ఘన చరిత్ర తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సొంతమన్నారు. అప్పటి కార్యనిర్వహణాధికారి స్వర్గీయ చెలికాని అన్నారావు
మానసపుత్రికగా ఆవిర్భవించిన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్న ఎందరో మహిళామణులను తీర్చిదిద్దిందన్నారు. ప్రముఖ గాయకురాలు డాక్టర్ శోభారాజ్ లాంటి ప్రముఖులు ఇక్కడి నుండే ఉద్భవించినట్టు తెలిపారు.
యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఇన్ ఇండియా సంస్థ గుర్తింపు పొందిన ఈ కళాశాల రాయలసీమలో మొదటిది, రాష్ట్రంలో రెండవది కావడం విశేషమన్నారు. ఇక్కడి విద్యార్థినులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు కృషి చేస్తున్నట్టు వివరించారు. తితిదే ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మనగుడి కార్యక్రమం కూడా తిరుపతిలో మొదటిగా ఇక్కడే నిర్వహించినట్టు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చిన మహనీయులను స్మరించుకోవడమే గాక వారి అడుగుజాడల్లో నడిచి జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.