TRISHULA SNANAM HELD IN SRI KT _ శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం
శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం
• ముగిసిన బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2025 ఫిబ్రవరి 28: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6.30 గంటలకు శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.
ఆ తరువాత ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.
హరిబ్రహ్మాదులకే లభ్యం గాని పవిత్రపాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షసభక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పర స్త్రీని చెరబట్టడమనే దుర్మార్గానికి పాల్పడటం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీకపిలేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.