TTD ALL SET READY FOR 2012 ANNUAL SALAKATLA BRAHMOTSAVAMS-TTD EO _ 2012 _ శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం : తితిదే ఈవో
శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం : తితిదే ఈవో
తిరుమల, 2012 సెప్టెంబరు 16: ఈ నెల 18 నుండి 26వ తారీఖు వరకు జరుగనున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమైనదని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు.
తొలిరోజైన సెప్టెంబరు 18వ తారీఖున ధ్వజారోహణం కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుమలకు విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు కానుకగా సమర్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వారి చేతులమీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించనున్నట్టు ఈవో వెల్లడించారు. అందులోభాగంగా రూ.11 కోట్లతో జిఎన్‌సి టోల్‌గేట్ వద్ద చేపట్టనున్న తిరువెంకటపథం రింగ్ రోడ్ రెండో విడత కార్యక్రమం, రూ.25 కోట్లతో నిర్మించనున్న శ్రీ వకుళామాత అతిథి భవనం శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. అంతేగాక స్వామి హుండీలో భక్తులు సమర్పించిన పురాతన నాణేలు, శాసనాలు, తీర్థాలు మొదలైన వాటి వైశిష్ట్యాన్ని తెలిపే కరపత్రాలను కూడా ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.
కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టు ఈవో తెలిపారు. ప్రతి నిమిషానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ఆర్‌టిసి బస్సులను నడపనున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ దాదాపు మూడు వేల ట్రిప్పులు తిరుమల నుండి తిరుపతికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
భక్తుల కోసం నాలుగు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో తితిదే ఆస్థాన విద్వాంసులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, డాక్టర్ మంగళంపల్లి బాలమురళికృష్ణతో సంగీత కచేరీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వివిధ కళాబృందాలు విభిన్న కళాకృతులను ప్రదర్శించనున్నట్టు వివరించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలోపు పాత అన్నప్రసాద భవనాన్ని పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మాట్లాడుతూ తిరుమలలో 18, 21, 22, 23, 26వ తారీఖుల్లో సాయంత్రం విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా 18, 22వ తారీఖుల్లో రూ.50/- దర్శన టికెట్ల కేటాయింపును పూర్తిగా రద్దు చేస్తామన్నారు. ఇక రూ.300/- టికెట్లను సమయానుకూలంగా పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామన్నారు. అలాగే ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేయనున్నట్టు జెఈఓ తెలిపారు.
ఈ సమావేశంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
2012 శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
దర్శనం :
1. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేయడమైనది.
2. ఉదయం, రాత్రి వాహనసేవల సమయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం మూలవిరాట్టు దర్శనంతో సమానమని పురాణభాష్యం.
3. వాహనాలపై స్వామివారిని ఊరేగించే సమయాల్లో భక్తులు దయచేసి నాణేలు విసరవద్దని మనవి.
4. గరుడ సేవ నాడు తిరుమలకు ద్విచక్రవాహనాలు నిషేధించడమైనది.
వసతి :
1. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, సత్రాలలో వసతిని పొందవచ్చు.
భద్రత :
1. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తితిదే నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు విభాగం సంయుక్తంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి.
2. చంటిపిల్లల భక్తులు జాగురూకతతో వ్యవహరించాలని మనవి.
3. మహిళా భక్తులు బంగారునగలు, విలువైన వస్తువులు తీసుకురాకూడదని విజ్ఞప్తి.
అన్నప్రసాదం :
1. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ గెస్ట్‌హౌస్, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, కాలిబాట మార్గాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు.
2. గత ఏడాది రికార్డుస్థాయిలో ఒకేరోజు 1.12 లక్షల మందికి తితిదే అన్నప్రసాద వితరణ.
పారిశుద్ధ్యం :
1. తిరుమల అంతటా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు చేపట్టారు.
రవాణా :
1. తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి నిమిషానికి ఒక బస్సు నడిపేందుకు ఆర్‌టిసి చర్యలు తీసుకుంది.
2. తిరుమలలో భక్తులను వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు ఆర్‌టిసి, తితిదే రవాణా విభాగం ఉచిత బస్సులు ఏర్పాటు చేయనున్నాయి.
వైద్యశాఖ :
1. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని 14 కేంద్రాల్లో అంటే వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, ఎటిసి, కళ్యాణకట్ట, రాంభగీచా అతిథి గృహాలు, నిత్యాన్నదానం, పాపవినాశనం, అశ్విని ఆసుపత్రి, శ్రీవారి మెట్టు నడకమార్గం, అలిపిరి నడకమార్గం వంటి ప్రాంతాల్లో ప్రాథమిక అత్యవసర చికిత్స కేంద్రాలు ఏర్పాటు.
కళ్యాణకట్ట :
1. భక్తుల రద్దీ దృష్ట్యా కక్షురకులు అందుబాటులో ఉండేవిధంగా ప్రస్తుతం ఉన్న 600 మంది సిబ్బందే కాకుండా 1703 మంది కళ్యాణకట్ట సేవకులతో భక్తులకు ఉచితంగా తలనీలాలు తీసే సౌకర్యాన్ని తితిదే ఏర్పాటుచేసింది.
శ్రీవారి సేవకులు :
1. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవలందించేందుకు వీలుగా 4,000 మంది శ్రీవారి సేవకులు, 1,600 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను తితిదే వినియోగించుకోనుంది.
సాంస్కృతిక కార్యక్రమాలు :
1. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల నాదనీరాజనం వేదిక ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయనున్నారు.
2. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ వాహన వైభవాన్ని, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
వివిధ ప్రదర్శనలు :
1. భక్తులను ఆకర్షించేందుకు వీలుగా విభిన్న ఆకృతులతో ఫలపుష్ప ప్రదర్శనలు, తిరుమల దివ్యచరిత్రను తెలిపేలా ఛాయాచిత్రాల ప్రదర్శన, ఆయుర్వేదం తదితర ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.
విద్యుద్దీపాలంకరణ :
1. భూలోక వైకుంఠంగా తిరుమల దివ్యక్షేత్రాన్ని ప్రస్ఫుటం చేస్తూ వివిధ పౌరాణిక అంశాలతో ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటుచేస్తోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.