TTD EO INSPECTS SHOPPING COMPLEX AND RBC AREAS _ తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్ మరియు ఆర్‌బిసి ప్రాంతాలను తనిఖీ చేసిన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్ మరియు ఆర్‌బిసి ప్రాంతాలను తనిఖీ చేసిన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
తిరుమల, 2024 జూలై 12: తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం, ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్‌లలోని దుకాణాలను శుక్రవారం అధికారులతో కలిసి ఈవో శ్రీ జె.శ్యామలరావు శుక్రవారం తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా షాపుల లైసెన్స్‌లు మరియు సంబంధిత ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. షాపింగ్ కాంప్లెక్స్ వరండాలో సరకులను నిల్వ ఉంచి, భక్తుల రాక పోకలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న దుకాణదారులను, షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల ఆనధికారిక తట్టలు, హాకర్లను హెచ్చరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, యాత్రికులు తిరిగేందుకు వీలు లేకుండా దుకాణదారులు సరుకులు ఉంచారని, అలా కాకుండా పరిశుభ్రతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో యాత్రికులు షాపింగ్ చేసే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ ను తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. త్వరలో అనధికారిక తట్టలు, హాకర్ల లైసెన్సులను తనిఖీ చేసి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు గోకులంలోని సమావేశ మందిరంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలపై ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల ఎస్టేట్స్ అధికారి శ్రీమతి విజయలక్ష్మి, ప్రత్యేక అధికారి శ్రీ మల్లిఖార్జున, ఏఈవో శ్రీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.