TTD JEO RELEASES MANI MANJARI LITERARY VOLUME _ శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి _ “మణిమంజరి” సాహితీ సంచిక ఆవిష్కరణ
Tirupati,29 August 2022: TTD JEO Sri Veerabrahmam hailed the contribution of Sri Veturi Prabhakara Shastri for spreading the glory of Sri Venkateswara Swamy worldwide with his soulful translation of Annamaiah Sankeertans.
Participating in the 72nd Vardhanti of Sri Veturi Prabhakara Shastri at the Annamacharya Kala Mandiram on Monday he also released the Mani Manjari literary publication of Sri Shastri.
Speaking later the TTD JEO said the late poet and writer had introduced high values of Telugu literature, culture, and traditions to the world and spent his life on the well-being of society.
He said Sri Shastri researched and brought to light the palm leaf and copper plate writings of Annamaiah Sankeertans. His book Neeti-Nidhi was an eye-opener for everyone.
Acharya Remilla Venkata Ramakrishna Sastry, OSD of TTD Publications who presided over the meeting said TTD had published 35 volumes of Annamaiah Sankeertans collected from copper plates and palm leaf writings and several others are ready for printing. Shastri wrote 40 books on themes like Prasadams, sevas, tonsuring in Srivari temple, etc.
Among other veteran scholars Dr. Samudrala Lakshmaiah, Sri Sarvottana Rao, Silicon Andhra University Acharya Dr. Addanki Srinivas, Dr. Akella Vibhishana Sharma, Director of Annamarcharya Project also spoke on the occasion.
FLORAL TRIBUTES
Earlier floral tributes and garlanding of the bronze statue of Sri. Veturi Prabhakara Shastry took place statue in the SVETA Bhavan complex.
TTD Dharmic Projects Program official Smt Vijayalakshmi, and Sub-Editor Dr. Narasimhacharyulu were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి
“మణిమంజరి” సాహితీ సంచిక ఆవిష్కరణ
– టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 2022 ఆగస్టు 29 ;తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం పేర్కొన్నారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 72వ వర్థంతిని సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో “మణిమంజరి” సాహితీ సంచికను ఆవిష్కరించారు.
జెఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయన ప్రతి క్షణాన్ని లోకకల్యాణం కోసమే వెచ్చించారని పేర్కొన్నారు. అతి ప్రాచీనమైన తాళపత్ర గ్రంథాలలో తెలియజేసిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా పరిశోధనలు చేశారని చెప్పారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చినట్టు తెలిపారు. సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన విషయాలు పరిష్కరించి నేటి సమాజానికి ఏవిధంగా ఉపయోగపడతాయో తెలియజేశారన్నారు. ఆయన రచించిన “నీతి-నిధి” పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలని, అందులో ప్రతి ఒక్కరు దయ కలిగి ఉండాలని తెలియజేశారన్నారు. 98 శాతం వ్యాధులు మనస్సు నుండి ఉద్భవిస్తాయని, యోగం ద్వారా వ్యాధులు దూరం అవుతాయని వివరించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రచురణల ప్రత్యేకాధికారి ఆచార్య రేమిల్ల వెంకటరామక్రిష్ణ శాస్త్రి ప్రసంగిస్తూ, శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి తెలుగు భాషకు విశేష సేవలు చేశారన్నారు. ప్రాచీన రాగి రేకుల్లోని కీర్తనలను వెలుగు చూడటానికి బాటలు వేశారన్నారు. ఇందులో 35 గ్రంథాలను టీటీడీ ప్రచురించిందని, మరికొన్ని ముద్రణకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అన్నమయ్య కీర్తనలు వెలుగు చూశాక ఎంతోమంది ఆ కీర్తనలు ఆలపిస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు, సేవలు, తిరు కల్యాణం (తలనీలాల సమర్పణ) వంటి అనేక విషయాలు ఆయన రచనలలో ఉన్నట్లు వివరించారు.
టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు విశ్రాంత ప్రత్యేకాధికారి డా. సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ, ఆంధ్ర వాఙ్మయ విస్తృతికి వేటూరి వారు ఎంతో కృషి చేశారని, గ్రంథ విమర్శనలో ఆయనకు మరెవరూ సాటి రారని చెప్పారు. వేటూరి వారు రచించిన 40 గ్రంథాలు లభించాయని, ఇంకా కొన్ని లభించాల్సి ఉందని తెలిపారు.
ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీ సర్వోత్తమరావు ప్రసంగిస్తూ, తెలుగులో మొదటి కవయిత్రి తాళ్లపాక తిమ్మక్కని తెలిపారు. ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయన పద్య సాహిత్యంతోపాటు కథలు, కథానికలు కూడా రచించారని వివరించారు.
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు డా. అద్దంకి శ్రీనివాస్ మాట్లాడుతూ, రామాయణ, భారత భాగవతాల కంటే భగవత్ ప్రాప్తి కలగాలంటే తిరుమల శ్రీవారిని ఆశ్రయించాలన్నారు. అన్నమయ్య సంకీర్తనలు అందరికీ అందుబాటులో తెచ్చిన ఘనత వేటూరివారిదన్నారు. 400 సంవత్సరాల పాటు మరుగున పడిపోయిన అన్నమయ్య సాహిత్యాన్ని శ్రీ వేటూరి వారు వెలుగులోకి తెచ్చారని తెలిపారు. ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయన ప్రతి క్షణాన్ని, ప్రతి కణాన్ని లోకకల్యాణం కోసమే వెచ్చించారని వివరించారు.
అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ మాట్లాడుతూ, వేటూరివారు అన్నమయ్య కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకువచ్చారన్నారు. ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి టీటీడీకి అందజేసినట్టు తెలిపారు. కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, సంస్కృత రూపకానువాదకర్తగా, జానపద సాహిత్య ప్రోత్సాహకుడని వివరించారు.
పుష్పాంజలి
ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతి శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి వేటూరిపీఠం పక్షాన పుష్పాంజలి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీమతి విజయలక్ష్మి, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.