TTD NETS Rs.107CR THROUGH HUMAN HAIR e-AUCTION _ తలనీలాల విక్రయం ద్వారా తితిదే ఆదాయం రూ.107 కోట్లు.
తలనీలాల విక్రయం ద్వారా తితిదే ఆదాయం రూ.107 కోట్లు.
తిరుపతి, మే 23, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో తితిదే రూ.107 కోట్ల ఆదాయాన్ని గడించింది.
తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో గురువారం నాడు తలనీలాల ఈ వేలం జరిగింది. 3,88,995 కిలోల మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. అయితే ఈ మొత్తంలో 65,060 కిలోల తలనీలాలు విక్రయించబడగా రూ.107 కోట్ల ఆదాయాన్ని తితిదే ఇందుమూలంగా పొందింది. ఇప్పటికి ఐదుసార్లు నిర్వహించిన ఈ-వేలంలో ఇది రెండో అధిక ఆదాయం కావడం విశేషం. గతేడాది జూన్‌లో నిర్వహించిన ఈ-వేలంలో అత్యధికంగా రూ.130 కోట్లను తితిదే సాధించింది.
తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలంలో పెట్టింది.
కిలో రూ.20,775/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 1,386 కిలోలలను వేలానికి ఉంచగా అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.3 కోట్ల ఆదాయం సమకూరింది.
కిలో రూ.18,650/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 61,775 కిలోలను వేలానికి ఉంచగా 50,700 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.94.58 కోట్ల ఆదాయం సమకూరింది.
కిలో రూ.7,451/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 58,688 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 11,000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.8.20 కోట్ల ఆదాయం లభించింది.
కిలో రూ.5,451/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 1,674 కిలోలను వేలానికి ఉంచగా మొత్తం అమ్ముడుపోయాయి. వీటిద్వారా రూ.91 లక్షల ఆదాయం సమకూరింది.
కిలో రూ.70/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను రెండు లక్షలా 64 వేలా 239 కిలోలను వేలంలో అమ్మకానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.
కిలో రూ.9,360/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 1,233 కిలోలను వేలంలో ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. రూ.28 లక్షల ఆదాయం సమకూరింది. కాగా ఐదో రకం వెంట్రుకల పైన తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యంతో చర్చించి దానిపై తగిన నిర్ణయాన్ని రెండు రోజుల్లో తీసుకుంటామని తిరుమల జెఈవో తెలిపారు.