భక్తుల రద్దీకి అనుగుణంగా టిటిడి మెరుగైన సేవలు
తిరుమల, 2019 అక్టోబరు 13: పెరటాసి మాసం కావడం, అందులోనూ వారాంతపు సెలవులు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి విశేషంగా భక్తులు విచ్చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టిటిడి ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు విశేషంగా సేవలందిస్తున్నారు. పెరటాసి మాసంలో శనివారం కావడంతో అక్టోబరు 12న 1,01,371 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 51,171 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి ఆలయంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో సిబ్బంది 24 గంటలు సేవలు అందిస్తున్నారు. తిరుమలలో బస కల్పించేందుకు విశ్రాంతి భవనాలలోని గదుల వివరాలను ఎప్పటికప్పుడు రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా భక్తులకు తెలియచేస్తున్నారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను అందుబాటులో ఉంచారు.
నారాయణగిరి ఉద్యానవనాలలోని క్యూలైన్లు, బయటి క్యూలైన్లు, వైకుంఠం – 1, 2 కంపార్టుమెంట్లు, అదేవిధంగా, సిఆర్‌వో, పిఏసి-1, రాంభగీచా బస్టాండు, హెచ్‌విసి, ఏఎన్‌సి తదితర ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ద్వారా భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలను శ్రీవారిసేవకుల ద్వారా నిరంతరం పంపిణీ చేస్తున్నారు. ఆరోగ్యవిభాగం ఆధ్వర్యంలో మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. టిటిడి ఇంజినీరింగ్, నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన భద్రత కల్పించడంతోపాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు.
శ్రీవారిసేవకుల విశేష సేవలు
పెరటాసి మాసంలో దసరా పర్వదినం తరువాత వరుసగా రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో శుక్రవారం నుండి తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. దాదాపు 1800 మంది శ్రీవారి సేవకులు భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా నారాయణగిరి ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాల్లోని క్యూ లైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2లో, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు, అన్నప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా యాత్రికుల సంక్షేమ సౌకర్యాల సేవకులు(పిడబ్ల్యుఎఫ్ఎస్) వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్నప్రసాదం, వైద్యం, పారిశుద్ధ్యం, శ్రీవారి ఆలయం, విజిలెన్స్ తదితర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు సత్వర సేవలు అందిస్తున్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.