Unveiling the statue of GREAT POET SRI PURANDARA DASA _ అలిపిరి వద్ద శ్రీ పురందరదాసులవారి విగ్రహాన్ని ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్
అలిపిరి వద్ద శ్రీ పురందరదాసులవారి విగ్రహాన్ని ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్
తిరుపతి, 2010 జూన్ 24: సరళమైన కన్నడభాషలో విశిష్టమైన కీర్తనలను నిర్మించి ప్రజలలో భక్తిభావాన్ని పెంచిన గొప్ప భక్తుడు శ్రీ పురందరదాసులవారు అని శ్రీరాఘవేంద్రస్వామిమఠం శ్రీశ్రీ 108 శ్రీ సుయతీంద్ర తీర్థస్వామిజీ తెలిపారు. గురువారం ఉదయం అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన పురందరదాసులవారి విగ్రహాన్ని మఠాధిపతులు, స్వామీజీలు, తితిదే ఛైర్మెన్, కర్నాటక హోంశాఖామాత్యులు, తితిదే ఇ.ఓలు అవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వామిజీవారు మాట్లాడుతూ తెలుగులో అన్నమయ్య తన వేల కీర్తనలతో స్వామివారి వైభవాన్ని నలుదిశలా చాటారని, అదే విధంగా కన్నడ భాషలో శ్రీ పురందరదాసులవారు భగవంతుడిని కీర్తిస్తూ ఎన్నో లక్షలమంది ప్రజలను థార్మికతవైపు నడవడానికి తన కీర్తనల ద్వారా కృషి చేసిన మహానుభావుడని అన్నారు.
ఉడిపి (కర్నాటక) పుత్తిగి మఠం స్వామిజీ శ్రీసుగుణేంద్ర తీర్థ స్వామి మాట్లాడుతూ ఈ దేశ సమైక్యత, సమగ్రత ధార్మికతతో ద్వారానే సాధ్యమౌతుందని, తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో ఆ ధార్మికత, ప్రపంచమంతా వెదజల్లబడుతుందని ఆయన తెలిపారు.
ఉడిపి పెషావర్ శిష్య పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామి మాట్లాడుతూ అందరి హృదయాల్లో పురందరదాసుల వారున్నారని, దాస సాహిత్య ప్రచారానికి, కృషి ఎనలేనిదని తెలిపారు.
కర్ణాటక రాష్ట్ర హోంశాఖామాత్యులు డాక్టర్ కె.ఎస్.ఆచార్య మాట్లాడుతూ ఈ తిరుమల క్షేత్రానికి, కర్నాటకకు ఎంతో అవినాభావ సంబంధం వుందన్నారు. సకల శాస్త్ర పారంగతులైన శ్రీ పురందరదాసులవారు తన కీర్తనల ద్వారా భక్తులలో శ్రీమన్నారాయణుడి తత్త్వాన్ని, స్వామి గొప్పదనాని చాటిన గొప్ప మహనీయుడు అని, అదేవిధంగా స్వామివారి ఆశీస్సులతో మనదేశం సుభిక్షింగా వుండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తితిదే పాలక మండలి ఛైర్మన్ శ్రీ డి.కె. ఆదికేశవులు మాట్లాడుతూ తితిదే దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హైందవ ధర్మప్రచారాన్ని విరివిగా చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఈ మహనీయుడి విగ్రహాన్ని అలిపిరిలో నెలకొల్పడం కూడా భక్తలోకానికి ఎంతో ఆనందదాయకమని అన్నారు.
తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు మాట్లాడుతూ భక్తాగ్రేసరుడైన శ్రీ పురందరదాసులవారు వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసముల సారమును తమ రచనలలో పొందుపరచి, భక్త కోటికి మహోపకారము చేసిన మహనీయుడని, ఆయన కీర్తనల ద్వారా మనం స్పూర్తిని పొందాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు డాక్టర్ ఎం. అంజయ్య, విశ్రాంత ఇ.ఓ. శ్రీ ఏ.పి.వి.ఎన్. శర్మ, దాససాహిత్య సలహామండలి సభ్యులు డాక్టర్ రొడ్డం ప్రభాకరరావు, జెఇఓ డాక్టర్ ఎన్. యువరాజ్, ఆర్థిక సలహాదారు శ్రీ ఎల్. విజయభాస్కర్‌రెడ్డి, ఎస్.ఇ. శ్రీ సుధాకర్, దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులవారు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాససాహిత్య సాంస్కృతిక మండలి సభ్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.