Valedictory Function of Archaka Training at SVETA Bhavan _ హిందూమతాన్ని, హిందూసాంప్రదాయాన్ని పరిరక్షించాలి – విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందసరస్వతి
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
హిందూమతాన్ని, హిందూసాంప్రదాయాన్ని పరిరక్షించాలి – విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందసరస్వతి
తిరుపతి, 2010 మే 26: హిందూమతాన్ని, హిందూసాంప్రదాయాన్ని పరిరక్షించవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందసరస్వతి స్వాముల వారు అన్నారు.
కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి విచ్చేసిన హరిజన, గిరిజనులకు స్థానిక శ్వేత భవనంలో గత వారం రోజులుగా అర్చకత్వంపై శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. బుధవారం అర్చకత్వ శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వాముల వారు ముఖ్యఅతిధిగా విచ్చేసి అనుగ్రహ భాషణం చేసారు. వేదభూమి అయిన భారతదేశాన్ని విచ్చినం చేసిన బ్రిటిష్ పాలకులతో కలసి కొందరు చరిత్ర హీనులు, తమస్వాలంభన కోసం కులవ్యవస్థను ప్రోత్సహించారని పేర్కొన్నారు.
దేవుని దృష్టిలో మనుషులందరూ ఒక్కటేనని, వేదాలలో, శాస్త్రాలలో ఎక్కడ కులమతాల ప్రస్తావన లేవని స్పష్ఠంచేసారు. అర్చకత్వానికి కులం అడ్డుకానేకాదని అన్నారు. హరిజనులు, గిరిజనులు, మత్స్యకారులు అర్చకత్వ పద్దతులను నేర్చుకొని వారివారి సొంత గ్రామాలలోని ఆలయాలలో పూజలు చేయడం వలన అన్యమత ప్రచారాన్ని అరికట్టవచ్చునని తెలిపారు. ముఖ్యంగా సముద్రతీరాలలోని మత్స్యకార్ల గ్రామాలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. దీనిని అరికట్ట వలసిన భాద్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని స్పష్టం చేసారు.
అనంతరం శిక్షణ పొందిన హరిజన,గిరిజనులకు యోగ్యతా పత్రాలు, పూజాసామాగ్రిని స్వామిజీ అందజేసారు.
ఈ కార్యక్రమంలో శ్వేత డైరక్టర్ భూమన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. –
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.