VENNEMUDDA KRISHNA ON CHANDRA PRABHA VAHANA _ చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
Tirumala, 24 September 2023: On the evening of the seventh day of the ongoing Srivari annual Brahmotsavams Sri Malayappa as Vennemudda Krishna Alankaram to bless His devotees on Sunday night.
The TTD chairman Sri Bhumana Karunakar Reddy, TTD EO Sri AV Dharma Reddy and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2023 సెప్టెంబరు 24: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు.
చంద్రప్రభ వాహనం – సకలతాపహరం
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చంద్రప్రభ వాహనసేవలో కళాబృందాల కోలాహలం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహనసేవలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. మొత్తం 11 కళాబృందాలలో 266 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు.
తిరుపతికి చెందిన శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు సునీల్ కుమార్ బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణలీలలు అద్భుతమైన ఘట్టాన్ని ప్రదర్శించారు. కర్ణాటక రాష్ట్రం, చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన నందినీశివప్రసాద్ బృందం డోలు నృత్యరూపకాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెంగుళూరుకు చెందిన అనన్య బృందం దాససంకీర్తన నృత్యంతో కనువిందు చేశారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బుల్తీదాస్ బృందం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన రచనకు బెంగాలీ నృత్యాన్ని ప్రదర్శించి భక్తులను అలరించారు.
రాజమండ్రికి చెందిన యం.హేమలత బృందం అమ్మవారి నృత్య రూపకాన్ని ప్రదర్శించి, భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. బెంగుళూరుకు చెందిన దివ్య బృందం సంపూర్ణ రామాయణ ఘట్టాలను ప్రదర్శించి భక్తిభావాన్ని పంచారు. తిరుపతికి చెందిన డి.యం.శ్రీనివాసులు బృందం వివిధ దేవతా వేషధారణలతో ఆకట్టుకున్నారు. తిరుపతికి చెందిన డా. మురళీకృష్ణ బృందం అష్టలక్ష్మీ వేషధారణతో భక్తులను తన్మయపరచారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జ్ఞాన రంజాన్ బృందం ఒడిస్సీ నృత్యంతో కనువిందు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన దాక్షాయనీ రామచంద్రన్ బృందం తాండా నృత్యరూపకం ప్రదర్శించి కనువిందు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన యు.కళైరాశి తమ కోలాట నృత్యాలతో అలరించారు.
టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.