అలిపిరి వద్ద ఘనంగా త్రైమాసిక మెట్లోత్సవం

అలిపిరి వద్ద ఘనంగా త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, 2010 నవంబర్‌-15: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే త్రైమాసిక మెట్లోత్సవం  అలిపిరిలో సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు.

తెల్లవారు జామున 4.30 గంటలకు శ్రీపాదరాజమఠం పీఠాధిపతి పూజ్యులు శ్రీశ్రీశ్రీ కేశవనిధిస్వామి ముఖ్య అతిధిగా పాల్గొని అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లపూజను శాస్త్రోత్తంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తితిదే ఇఓ శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు, సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ ఎన్‌. యువరాజ్‌, దాససాహిత్య ప్రాజెక్టు ముఖ్య అధికారి శ్రీ పి.ఆర్‌. ఆనందతీర్థాచార్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ అభిభాషణలో స్వామి కేశవనిధి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానము ఎన్నో భక్తిపూర్వకమైన కార్యక్రమాలు చేపడుతున్నదని ప్రసంశించారు. తెలుగులో ఏవిధంగానైతే పదకవితా  పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ అనేక వేల కీర్తనలు రచించారో అదేవిధంగా కన్నడ భాషలో భక్తకవి శ్రీపురందరదాసు స్వామివారిని స్తుతిస్తూ కొన్ని లక్షల సంకీర్తనలు రచించారన్నారు. భాషా ప్రాంతాలకు అతీతంగా తితిదే భక్తి రసాన్ని, సనాతన ధర్మాన్ని, ఆచారాన్ని సంరక్షించడంలో భాగంగా చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్‌లో కూడా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం తితిదే ఇఓ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు మాట్లాడుతూ దాసపదాలను ప్రచారం చేయడానికి తితిదే దాససాహిత్య ప్రాజెక్టును ఏర్పాటుచేసిందని అన్నారు. భక్తి రసానికి ఎల్లలు లేవని అందరు స్వామివారి సేవలో తరించాలని అన్నారు.  ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టువారు చేపట్టిన ఈ మెట్లోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రసంశించారు.

అనంతరం దాదాపు 3 వేల మంది దాస భక్తులు పురందరదాసు కీర్తనలను ఆలపిస్తూ అలిపిరి నుండి తిరుమలకు పాదయాత్ర చేసారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.