VENGAMAMBA VARDHANTHI UTSAVAM ON AUGUST 15-16 _ ఆగస్టు 15, 16వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతి ఉత్సవాలు

Tirupati, August 12, 2021: TTD is organizing the 204th Vardhanti utsavam of Srivari ardent disciple Matrusri Tarigonda Vengamamba on August 15-26 at Tirumala, Tirupati and Tarigonda under the aegis of TTD Tarigonda Vengamamba project in a limited manner due to COVID restrictions.

AT TARIGONDA

TTD shall organize Bhakti sankeertan programs in the local Sri Lakshmi Narasimhaswamy temple on August 15 at Tarigonda. The Kalyanotsavam of Sri Lakshmi Narasimha Swamy shall be held on August 16th evening. 

AT TIRUPATI

TTD is organizing a literary convention on Tarigonda Vengamamba at Annamacharya Kala Mandir on August 15 morning followed by cultural programs in the evening.

Similarly, on August 16 TTD officials will garland the statue of Tarigonda Vengamamba at MR Palli circle in the morning followed by cultural programs with eminent artists shall be held both morning and evening at the Kala Mandir.

AT TIRUMALA

TTD officials shall garland and pay floral tributes at Tarigonda Vengamamba Brindavanam in the morning of August 16.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 15, 16వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతి ఉత్సవాలు

తిరుపతి, 2021 ఆగస్టు 12: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 15, 16వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో జ‌రుగ‌నున్నాయి. టిటిడి తరిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌తో ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

త‌రిగొండ‌లో…

వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం జ‌రుగ‌నుంది.

తిరుప‌తిలో

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 15వ తేదీన ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు జ‌రుగనుంది. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 16వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 16వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు.

తిరుమ‌ల‌లో

ఆగస్టు 16వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టిటిడి ఉన్నతాధి కారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.

వెంగ‌మాంబ ప్ర‌స్థానం

తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతులకు జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు ‘వెంగమాంబ’ అని పేరు పెట్టారు. ఈమెకు పదేళ్ల వయసులోనే ఇంజేటి వేంకటాచలపతి అనే వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. వివాహమైన కొన్నాళ్లకే భర్త వియోగం ఏర్పడింది. అయినా శ్రీ వేంకటేశ్వరుడే తన భర్త అని ప్రకటించి వెంగమాంబ ముత్తయిదువు చిహ్నాలు ధరించే ఉండేవారు. మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక విద్య, యోగవిద్య ఉపదేశం పొందారు. కొద్దికాలానికే ఆ విద్యల్లో ఎంతో అనుభవం సాధించారు. ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలకు సంబంధించి తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలు రాశారు. ఇందులో యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపదరచనలు ఉన్నాయి.

వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవలో ”ముత్యాలహారతి” అనే విశిష్ట నిత్యకైంకర్యాన్ని నెలకొల్పారు. ఈ సేవ నేటికీ అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యుల వారిని ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి వెంగమాంబ కావడం విశేషం. క్రీ.శ. 1817వ సంవత్సరంలో తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరున్ని స్మరిస్తూ వెంగమాంబ సజీవసమాధి చెందారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.