ఆగస్టు 6వ తేదిన భక్తి చైతన్య రథయాత్ర 

ఆగస్టు 6వ తేదిన భక్తి చైతన్య రథయాత్ర

తిరుపతి, ఆగష్టు -4,  2009: శ్రీ జగన్నాధదాసర ద్విశతాబ్ది మహోత్సవ ఆరాధనోత్సవాల సందర్భంగా తితిదే దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో భక్తి చైతన్య రథయాత్ర ఆగస్టు 6వ తేదిన అలిపిరిలో ప్రారంభమవుతుంది.

ఈ సందర్భంగా 18 రోజులపాటు నిర్వహించనున్న ఈ భక్తి చెతన్యయాత్రను ఆగస్టు 6వ తేదిన ఉదయం 5.30 నుండి 6.30 గంటల మధ్య స్థానిక అలిపిరి పాదాలమండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి జస్టీస్‌ వెంకటాచలయ్య, తితిదే పాలకమండలి చైర్మన్‌ శ్రీ డి.కె. ఆదికేశవులు, ఇఓ శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు, జెఇఓ శ్రీ యువరాజ్‌, తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి, భక్తులు పాల్గొంటారు.

ఆగస్టు 6వ తేదిన అలిపిరి నుండి బయలుదేరే ఈ రథము హైదరాబాద్‌, మల్కడ్‌, గుర్బర్గా, బీజాపూర్‌, భాగల్‌కోట, ధార్వాడ్‌, హుబ్లీ, హవేరీ, సావనూర్‌, గదగ్‌, కొప్పల్‌, హోస్పేట్‌, కాంప్లీ, గంగావతి, బళ్ళారి, చిత్రదుర్గ, బెంగళూర్‌, మంత్రాలయం, గద్వాల్‌, రాయచూర్‌ల మీదుగా ప్రయాణించి ఆగస్టు 21వ తేదిన కర్నాటకలోని మాన్వి అను ప్రాంతానికి చేెరుతుంది. ఇక్కడ ఏడురోజులపాటు జగన్నాథదాసర ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

సంక్షిప్త సమాచారం:-

శ్రీ జగన్నాథదాసులవారు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రియభక్తుడు. ఒకసారి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, చివరథలో స్వామిని దర్శించి వెళ్ళాలనే ఆలోచనతో ఇతరుల సహాయంతో తిరుమలకు రాగా స్వామివారు ఆయనను అనుగ్రహించినట్లు, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తన ప్రాంతమైన మాన్వికి చేరుకుని స్వామివారి వైభవాన్ని, లీలల్ని భక్తులకు తెలిపేవారని భక్తుల అభిప్రాయం.

హరిదాస సంస్కృతిని, సాహిత్యాలను ప్రచారం చేయడమే దాససాహిత్య ప్రాజెక్ట్‌ కర్తవ్యం. హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని ఈ రథయాత్ర ద్వారా భక్తకోటికి చూపుతూ ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో తిరుగుతూ ఈ రథం మాన్వి ప్రాంతం చేరుకుంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుండి తీసుకువచ్చే ఒక జ్యోతిని ఈ రథంలో అమర్చుతారు. ఈ రథయాత్ర సందర్భంగా కర్నాటకకు చెందిన జగన్నాథదాస ఉత్సవ కమిటి, శ్రీమంత్రాలయ రాఘవేంద్రస్వామిమఠం రథం పర్యటించే ప్రాంతాలలో భక్తులకు సహకరిస్తారు.  

తితిదే హిందూధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా శ్రావణపూర్ణిమ సందర్భంగా ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్న తితిదే కల్యాణమండపాలు, ప్రక్క రాష్ట్రాలలో ఉన్న తితిదే కల్యాణమండపాలలో ఉదయం 10.00 గంటలకు శ్రీనివాస కల్యాణం, రక్షాబంధనం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం వెనుక గల మైదానం నందు ఈ శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 5వ తేదిన ఉదయం 10.00 గంటలకు శ్రీనివాస కల్యాణం, రక్షాబంధనం వేడుకగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.