ఆలయాల్లో ఆగమశాస్త్రాలను తప్పక పాటించాలి-చతురాగమ సదస్సు తీర్మానం

ఆలయాల్లో ఆగమశాస్త్రాలను తప్పక పాటించాలి

చతురాగమ సదస్సు తీర్మానం

తిరుపతి, 2012 జూలై  05: అన్ని ఆలయాల్లో ప్రాచీన సంప్రదాయాలను పాటిస్తూ ఆగమ పండితులు సూచించిన విధంగానే అర్చనాదులు విధిగా నిర్వహించాలని చతురాగమ సదస్సు తీర్మానించింది. తిరుపతి లోని శ్వేత భవనంలో మూడు రోజుల పాటు జరిగిన చతురాగమ సదస్సు గురువారం ముగిసింది.

శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమాల ప్రకారం చేపట్టాల్సిన మార్పులపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు.

         ఆగమ పండితులు నిర్వహించే సదస్సులకు తమ లాంటి అధికారులు రావడం వల్ల వాటికి సంబంధించిన విషయ పరిజ్ఞానం పెంచుకునే అవకాశం కలుగుతుందన్నారు. తితిదే ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ఆచార్య రవ్వా శ్రీహరి ప్రసంగిస్తూ ఆగమశాస్త్రాలకు సంబంధించి మిగిలి ఉన్న గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేసి భావితరాలకు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. ఆగమాల ద్వారా భారతీయ సంస్కృతిని రక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆగమ పండితులను, అర్చకులను ఆయన కోరారు. అనంతరం పత్రసమర్పణ చేసిన ఆగమ పండితులను తితిదే వైఖానస ఆగమ సలహాదారు డాక్టర్‌ వేదాంతం శ్రీ విష్ణుభట్టాచార్యులతో కలసి సివిఎస్‌ఓ సన్మానించారు. హాజరైన వైఖానస, పాంచరాత్ర, శైవ, వైదికస్మార్త ఆగమ పండితులందరికీ ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సదస్సు పలు తీర్మానాలను ఆమోదించింది.

1. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రీయ అంశాలను ఆయా సంప్రదాయ ఆగమ పండితులు సూచించిన మేరకు ఆచరించాలి.
2. ఆగమశాస్త్రంలో ప్రతిపాదించిన విధివిధానాలను తూ.చ. తప్పక ఆయా ఆలయాల్లో ఆచరించాలి. ఆగమశాస్త్ర భిన్నమైన పద్ధతులను పాటిస్తే సంస్కృతి సంప్రదాయానికి విఘాతం కలిగి ప్రపంచశాంతికి హాని ఏర్పడుతుంది.
3. ఆగమశాస్త్ర పండితులు సూచించిన ఆగమ గ్రంథాలను తితిదే ప్రచురించి శాస్త్రపరిరక్షణ గావించాలి.
4. ఆగమవిద్యను అభ్యసించిన నిరుద్యోగ ఆగమ విద్వాంసులకు ప్రతినెలా స్కీం వేదపారాయణదారునికి చెల్లిస్తున్న విధంగా కొంత జీవనభృతిని తితిదే కల్పించాలి.
5. 60 సంవత్సరాలు దాటిన వృద్ధ ఆగమపండితులకు జీవనభృతిని కల్పించి వారి తదనంతరం వారి భార్యలకు కూడా ఆ భృతి వర్తించు విధంగా తితిదే ఏర్పాటుచేయాలి.
6. ప్రతి సంవత్సరం శాస్త్ర పరిరక్షణకు చర్చాగోష్ఠి నిమిత్తమై ఈ చతురాగమ సదస్సు విధిగా నిర్వహించాలి.