ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ఘనంగా అఖండగానయజ్ఞం ప్రారంభం

ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ఘనంగా అఖండగానయజ్ఞం ప్రారంభం

తిరుపతి, జనవరి 31, 2013: సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 166వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాల ఆధ్వర్యంలో 3వ  అఖండ ఆరాధనోత్సవం   గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి చల్లా ప్రభావతి దీక్షితులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఉదయం 8.00 గంటలకు శ్రీ వి.సత్యనారాయణ బృందం నాదస్వరంతో అఖండ సంగీత ఆరాధన కార్యక్రమం ప్రారంభమైంది. ఈయన ‘నమో నమో రాఘవాయ’, ‘రామా నిన్నే నమ్మినాను’ తదితర త్యాగరాజ కృతులను లయబద్ధంగా నాదస్వరంపై పలికించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భజన సంప్రదాయ నామసంకీర్తనంతో పూజలు నిర్వహించారు. ఉదయం 11.00 గంటలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ”జగదానంద కారక జయజానకీ ప్రాణనాయక”, ”ఎందరో మహానుభావులు అందరికి వందనాలు” వంటి ఘనరాగ పంచరత్న కృతులను 50 మంది కళాకారులు బృందగానం చేశారు.
సాయంత్రం జరిగే కార్యక్రమంలో త్యాగరాజస్వామి రచించిన పంచ వైవిధ్యమైన ప్రత్యేక పంచరత్న కృతులను ఆలపించనున్నారు. శ్రీమతి లక్ష్మీసువర్ణ బృందంచే నాదస్వరం. శ్రీమతి చిన్నమ్మదేవి వారి బృందంచే వీణ, శ్రీమతి చల్లా ప్రభావతి వారి బృందంచే వయొలిన్‌ సోలో, శ్రీమతి వై.వి.యస్‌ పద్మావతి వారి బృందంచే గాత్రం తదితర అంశాలను ప్రదర్శించనున్నారు. ఉదయం 8.00 గంటలకు ప్రారంభమైన ఈ అఖండ ఆరాధన కార్యక్రమం శుక్రవారం ఉదయం 11.00 గంటల వరకు 27 గంటల పాటు నిరంతరాయంగా జరుగనుంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.