కార్యదక్షతకు ప్రతీకగా మహిళాఉద్యోగినులు నిలవాలి – తితిదే ఇఓ శ్రీ కృష్ణారావు 

కార్యదక్షతకు ప్రతీకగా మహిళాఉద్యోగినులు నిలవాలి – తితిదే ఇఓ శ్రీ కృష్ణారావు

తిరుపతి, మార్చి-08, 2011: తిరుమల తిరుపతి దేవస్థానము వంటి ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థలో దాదాపు 9 వేల మంది ఉద్యోగులలో 4 వేల మంది మహిళా ఉద్యోగినులు వారిలో వుండటం అత్యంత అభినందనీయమని, వీరు కార్యదక్షతలో కూడా అందరికి ఆదర్శంగా నిలవాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు ఆకాంక్షించారు.

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మంగళవారం నాడు 101వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అత్యంత వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా తితిదే సాధికారమండలి అధ్యకక్షులు శ్రీ జె.సత్యనారాయణ గారి సతీమణి శ్రీమతి అపర్ణ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని విశిష్ఠ అతిధిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన  తితిదే శ్రీ ఇఓ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు మాట్లాడుతూ సాధారణంగా మహిళలు సహనంతో బాధ్యతాయుతంగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారన్నారు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన ఉద్యోగ నియామకాలలో అధికశాతం మహిళలకే అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. స్వామివారి కొలువులో బాధ్యతలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మహిళా ఉద్యోగినులు అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో, కార్యదక్షతతో సంస్థకు వన్నెతీసుకొనిరావడమే కాకుండా, సంస్థ ప్రతిష్ఠను థదిశలా వ్యాపింపచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతే కాకుండా మహిళలు తిరుమల, తిరుపతిలలో ఎక్కడ బాధ్యతలు అప్పగించినా, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు.

కాగా ఈ కార్యక్రమానికి తితిదే మహిళా ఉద్యోగినుల న్యాయకురాలు శ్రీమతి టి. ఇందిర ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అనంతరం తితిదే ఆస్థాన గాయకులు పద్మశ్రీ డాక్టర్‌ శోభారాజు మాట్లాడుతూ మహిళా దినోత్సవానికి 100 ఏళ్ళు దాటినా నేటికి ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై ఎన్నోరకాల అత్యాచారాలు జరుగుతూనే వున్నాయన్నారు. దీనికి తోడు సినిమాల చెడుప్రభావం మరింత ఎక్కువగా వున్నదన్నారు. యువతరానికి మార్గదర్శకంగా వుండే కార్యక్రమాలను పెంపొందించగలిగితే సమాజంలో స్త్రీలపట్ల ఉన్నతభావంపెరుగుతుందన్నారు. పాశ్చాత్య పోకడలకు స్వస్థిపలికి భారతీయతను యువత అలవర్చుకోవలన్నారు.

అనంతరం ఐ.ఎ.& ఎ.ఎస్‌. సహాయ అకౌంటు జనరల్‌ (గణాంకవిభాగం) చెందిన శ్రీమతి అనితషా ఆకెళ్ళ మాట్లాడుతూ మహిళలు నేడు సకలవిద్యాపారంగతులుగా వివిధ రంగాలలో రాణిస్తున్నారన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలులుగా రాణిస్తున్న మహిళలు ఇంకా ఉన్నతోన్నత పదవులు చేపట్టాలంటే ఎక్కడ పని ఇచ్చిన, ఎంతకష్టమైన పని ఇచ్చిన చేసి తమ సత్తాను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.

అనంతరం స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ మాట్లాడుతూ సినిమాలకు తోడుగా టివి ధారావాహికల ప్రభావం నేటి యువతపై మెండుగావున్నదన్నారు. దీంతో యువతలో రోజురోజుకి శారీరక, మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయన్నారు. ముఖ్యంగా మహిళలలో  రొమ్ము క్యాన్సర్‌, సర్వ్యైకల్‌ క్యాన్సర్‌ వంటి భయానక వ్యాధులుకూడా సంక్రమించు తున్నాయన్నారు. అటువంటి వారికి స్విమ్స్‌లో మ్యామోగ్రఫి అనే ఒక పరికరము ద్వారా పరీక్షలు చేయించుకొనే అవకాశం తాము కల్పిస్తున్నామన్నారు.

అనంతరం 6వ అదనపు జిల్లా జడ్జీ శ్రీమతి లక్ష్మీకామేశ్వరి మాట్లాడుతూ మహిళలలను శక్తిమంతులుగా ఎదగనీయవలసిన అవసరం సమాజంలో ఎంతైనావుందన్నారు. కాని నేటికి ప్రతి 1000 మంది పురుషులకు కేవలం 970 మంది మహిళలు మాత్రమే జన్మిస్తున్నారన్నారు. అందుకు కారణం గర్భాశయంలో వుండగానే ఆడశిశువు అత్యకు గురిఅవుతున్నదన్నారు. ప్రపంచం వేగంగా ముందుకి సాగిపోతున్నా ఇప్పటికి భ్రూణమరణాలు కొనసాగుతుండడం నేటికి సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న హింసలకు తార్కాణం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిధులుగా శ్రీమతి ప్రభకుందన, శ్రీమతి చేతనసింగ్‌, శ్రీమతి జయశిల్ప, శ్రీమతి సావిత్రమ్మ లు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి (సేవలు) శ్రీమతి సూర్యకుమారి, ఉపకార్యనిర్వహణాధికారులు శ్రీమతి చెంచులక్ష్మి, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి మనోహరి, శ్రీమతి ఝాన్నీరాణి, శ్రీమతి సరోజిని, తితిదే ఆసుఫత్రులకు చెందిన డాక్టర్లు, నర్సులు, తితిదే ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇరజనీర్లు, వివిధ పాఠశాలలకు, కళాశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు తదితర తితిదే అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో అత్యుత్తమ సేవలు అందించిన 31 మంది మహిళాఉద్యోగినులకు ప్రశంసాపత్రాలను, బంగారు పతకాలను, స్వామివారి చిత్రపటాలను అందించి సత్కరించారు. అటు తరువాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు సభలోని వారిని విశేషంగా అలరించాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.