ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు

ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు

తిరుమల. 2021 ఫిబ్ర‌వరి 12: తిరుమలలో గత మూడురోజులుగా టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు శుక్ర‌వారంనాడు ఆస్థాన మండ‌పంలో ఘనంగా ముగిశాయి.

దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ మాన‌వ జీవ‌న విధానంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌కు పూర్వ‌జ‌న్మ క‌ర్మ ఫ‌ల‌మే కార‌ణ‌మ‌న్నారు. దీని నుండి బ‌య‌ట ప‌డ‌టానికి మ‌హ‌త్ముల‌ను సంద‌ర్శించి వారి మార్గ‌ద‌ర్శ‌కంలో భ‌గ‌వంతుడిని సేవించ‌డం ద్వారా మోక్షం పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు.

అదేవిధంగా శ్రీ‌ పురంద‌ర‌దాసుల‌వారు జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుకే  సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు.  

అంత‌కుముందు ఉద‌యం 6.00 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారులు సుప్రభాతం సుప్ర‌భాతం, ధ్యానం, సామూహిక భ‌జ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం ఉద‌యం 8.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు హ‌రిదాస ర‌స‌రంజ‌ని క‌ళాకారుల‌తో  పురందరదాస సంకీర్తనలను గోష్ఠిగానం ఆలపించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.