TRAIMASIKA METLOTSAVAM _ జనవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

జనవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 03: టిటిడి ఆధ్వర్యంలో జనవరి 8 నుండి 10వ తేదీ వరకు ధనుర్మాస పూజాసహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి శ్రీ గోవిందరాజస్వామి మూడవ సత్ర ప్రాంగణములో ప్రారంభమవుతాయి.

జనవరి 8, 9వ‌ తేదీల్లో ఉదయం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుండి 12.00 గంటల వరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, త‌మిళ‌నాడు, మహరాష్ట్ర ప్రాంతాల భజన మండళ్లతో సంకీర్తన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ధార్మిక సందేశం, హరిదాసుల ఉపదేశాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

జనవరి 8వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. అలిపిరి పాదాల మండపంలో జనవరి 10వ‌ తేదీ ఉదయం 4.30 గంటలకు అధికార ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 

Tirupati, 3 Jan. 20: TTD is organising Srivari Trimasika Metlotsavam festivities from January 8-10 which will commence at the Sri Govindarajaswamy Third Choultry.

On January 8-9 bhajan mandals will conduct suprabatham, dhyanam and group bhajans from morning 5-7am.

Later on from 8am to 10.30am bhajan mandals from Telangana, Karnataka, Tamil Nadu and Maharashtra will perform sankeertans, dharmic discourses  and devotional speeches by seers followed by devotional cultural programmes.

In the evening Srivari Shoba Yatra will be conducted from 4pm on January 8. Metla Pooja is performed and there after along with nearly 3000 bhajan mandali members will scale the Saptagiri hills.

Metlotsavam festival was organised by Dasa Sahitya Project(DSP) to revive the historic and devotional trekking journey  on foot to Tirumala in the footsteps of great saintly persons, devout emperors and Srivari disciples. 

The DSP Special Officer Sri PR Anandatheerthacharylu is supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI