తితిదే నిబంధనలకు అనుగుణంగానే శ్రీవారి దర్శనం: ఆలయ అధికార వర్గాల వివరణ

తితిదే నిబంధనలకు అనుగుణంగానే శ్రీవారి దర్శనం: ఆలయ అధికార వర్గాల వివరణ

తిరుమల, ఏప్రిల్‌ 01, 2013: తిరుమల శ్రీవారి ఆలయంలో సినీ నటుడు రాఘవ లారెన్స్‌కు తితిదే నిబంధనల ప్రకారమే దర్శన ఏర్పాట్లు చేయడమైనది.

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మూడు రోజులుగా లక్షలాది మంది భక్తులు బారులుతీరిన విషయం విదితమే. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తితిదే విధులు నిర్వహిస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం గురువారం తప్ప వారంలో మిగతారోజుల్లో సాయంత్రం విఐపి బ్రేక్‌ దర్శనాన్ని సైతం రద్దు చేసేందుకు తితిదే పాలకమండలి, యాజమాన్యం యోచిస్తోంది.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో విఐపిల కేటగిరీలో రెండవ లిస్టు ప్రాధాన్యతాక్రమంలో సినీ నటుడు రాఘవ లారెన్స్‌కు తితిదే దర్శనాన్ని కేటాయించింది. అయితే తన కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం సినీనటుడు రాఘవ లారెన్స్‌ తితిదే తనకు దర్శన ఏర్పాట్లు సరిగా చేయలేదని, ఆలయం లోపల శ్రీవారి ముందు తనకు హారతి ఇవ్వలేదని, లోపల ఒకరిద్దరు అర్చకులు, అధికారులు తోసేశారని ఆరోపణలు చేయడం వాస్తవదూరం.

తితిదే ప్రస్తుతం అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే ఎల్‌1, ఎల్‌2 మరియు ఎల్‌3(విఐపి జనరల్‌) ప్రాధాన్యతాక్రమంలో దర్శన ఏర్పాట్లను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నది. అంతేకాకుండా సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో విఐపిల దర్శన క్యూలైన్‌ను ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి చిన్నంగారి రమణ ఇతర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా నిర్వహించడమైనది. దర్శనానంతరం రాఘవ లారెన్స్‌ కోరిక మేరకు పోటు పేష్కార్‌ కేశవరాజు లడ్డూ ప్రసాదం, తీర్థప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా దర్శనానంతరం ఆలయం వెలుపల రాఘవ లారెన్స్‌ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తితిదే దర్శన ఏర్పాట్లపై ఆరోపణలు చేయడం బాధాకరం. శ్రీవారి ఆలయంలో ఎల్‌2 ప్రాధాన్యతాక్రమంలో తితిదే యాజమాన్యం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే తితిదే అధికారులు వ్యవహరించారని స్పష్టం చేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.