దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 18 నుండి అధికమాస మహోత్సవాలు

దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 18 నుండి అధికమాస మహోత్సవాలు

తిరుపతి, 2012 ఆగస్టు 17: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 18 నుండి 26వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అధికమాస మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దాససాహిత్య ప్రాజెక్టు విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా విశేషమైన దినాల్లో ఉత్సవాలు, ప్రముఖ పండితుల ఆరాధనా మహోత్సవాలు, గోష్టిసంకీర్తనమాల తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 18వ తేదీన బెంగళూరులోని శ్రీ సత్యాత్మతీర్థుల చాతుర్మాస దీక్షాస్థలంలో శ్రీనివాస సంకీర్తనమాల నిర్వహించనున్నారు. శ్రీ ఉత్తరాది పీఠాధిపతుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.

అదేవిధంగా ఆగస్టు 19వ తేదీన తుమ్‌కూరులో శ్రీ లక్ష్మీనరసింహయాగం నిర్వహించ నున్నారు. శ్రీ భూసమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు అర్చన, ఊంజల్‌సేవ జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీనివాస వైభవం సంగీత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఆగస్టు 20వ తేదీన శ్రీముఖ జిల్లా తారికెరెలో శ్రీ భూసమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు సుప్రభాతం, అర్చన, ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. అనంతరం తిరుమంజనాభిషేకం, శాంతియాగం జరుగనున్నాయి. ఈ సందర్భంగా భక్తి సంగీత కచేరి నిర్వహించనున్నారు. ఈ అధికమాసంలో శ్రీవారిని సేవిస్తే వంద రెట్లు ఎక్కువ ఫలితం సిద్ధిస్తుందని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.