‘పరువుపోతోంది…!’ అను వార్త వాస్తవం కాదు

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ
(జనవరి -21, 2011)

‘పరువుపోతోంది…!’ అను వార్త వాస్తవం కాదు

జనవరి 12వ తేదిన ఈనాడు దినపత్రిక నందు ప్రచురించిన ‘పరువుపోతోంది…!’ అను వార్త వాస్తవం కాదు.

 సదరు వార్తనందు తితిదే క్యాలెండర్లు నల్లబజారులో అమ్మకం, సామాన్యభక్తులకు అందని వైనం, సిఫార్సు లేఖలకే ప్రాధాన్యం అని కూడా వ్రాయడం సరికాదు.

లక్షలాది మంది శ్రీవారి భక్తులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూసే శ్రీవారి కొత్త సంవత్సరపు  క్యాలెండర్లు, డైరీలకు ఉన్న డిమాండుకు అనుకూలంగా ముద్రించడం జరుగుతున్నది.శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు భక్తులకు చేరాలనే సదుద్దేశ్యంతో తిరుమల, తిరుపతిలలోనే కాకుండా ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ తదితర ముఖ్యపట్టణాలలో విక్రయించడం జరుగుతున్నది. గత ఏడాది మూడు లక్షల క్యాలెండర్లను, లక్ష డైరీలను ముద్రించారు. ఈ ఏడాది డిమాండు దృష్ట్యా నాలుగు లక్షల క్యాలెండర్లు, లక్షా ఇరవై వేల డైరీలను ముద్రించడం జరిగింది. డి.డిలు పంపిన వారికి ఇప్పటికే వారు కోరినన్ని క్యాలెండర్లు, డైరీలు పంపడం జరిగింది. గత ఏడాది డిశెంబర్‌ చివరిలో క్యాలెండర్లు, డైరీలు అమ్మకాలు సాగించగా, ఈ ఏడాది డిశెంబర్‌ 2వ వారంలోనే అమ్మకాలు ప్రారంభించామని ముఖ్యంగా తిరుమలలో సప్తగిరి సత్రాలు, శ్రీవారి ఆలయం ఎదురుగా, ఎ.టి.సి. వద్ద అదేవిధంగా తిరుపతిలో ధ్యానమందిరం, శ్రీనివాసం, తితిదే పరిపాలనా భవనం వద్ద అమ్మకపు కేంద్రాలు ఏర్పరచి భక్తులందరికీ అందేటట్లు ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం.

కనుక రేపటి మీ దినపత్రిక నందు ఈ విషయాన్ని వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి