పురందరదాస ఆరాధన మహోత్సవాలు ప్రారంభం

పురందరదాస ఆరాధన మహోత్సవాలు ప్రారంభం

తిరుపతి, ఫిబ్రవరి 02, 2013: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని వేలాది కీర్తనలతో కీర్తించిన శ్రీ పురందరదాస ఆరాధన మహోత్సవాలు శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా ఉత్తనూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
 
మహబూబ్‌నగర్‌ జిల్లా ఉత్తనూర్‌లో శనివారం నుండి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు, కర్ణాటక రాష్ట్రం హంపిలో ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో, తిరుమలలో 10, 11వ తేదీల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లో ఫిబ్రవరి 11 నుండి 17వ తేదీ వరకు, మహాకుంభమేళా జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాదులో ఫిబ్రవరి 15, 16వ తేదీల్లో, వారణాసిలో ఫిబ్రవరి 17 నుండి 20వ తేదీ వరకు పురందరదాస ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి.
 
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో భజనలు, సంగీత కచేరీలు, ఆధ్యాత్మికోపన్యాసాలు ఏర్పాటు చేయనున్నారు. శ్రీ పురందరదాసుల వారు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులోని పురందరఘడ గ్రామంలో 1480వ సంవత్సరంలో జన్మించారు. వీరి పూర్వనామం శ్రీ శ్రీనివాసనాయక. ఈయన పెద్ద వజ్రాల వ్యాపారి. ఈయనకు ‘నవకోటి నారాయణ’ అనే బిరుదు ఉంది. శ్రీవారి నామసంకీర్తన గొప్పదనాన్ని తెలిపేందుకు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం నారద మహర్షి ఈయన రూపంలో వచ్చినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈయన హంపికి వచ్చి శ్రీకృష్ణదేవరాయల రాజగురువు శ్రీ వ్యాసరాజయతీశ్వరుల వద్ద శిష్యరికం చేశారు. గురువు ఈయనకు పురందరదాసుగా నామకరణం చేశారు.
 
పురందరదాసుల వారు 4,75,000 కీర్తనలు రచించారు. శ్రీ వ్యాసరాజయతీశ్వరులు చూపిన మార్గంలో పయనిస్తూ వేద ఉపనిషుత్తు, పురాణ, ఇతిహాసాల సారాన్ని తన రచనల్లో పొందుపరిచి ఆబాలగోపాలాన్ని అలరించారు. ఈయన సంకీర్తనల లక్ష్యం సామాన్య ప్రజల్లో భక్తితత్వాన్ని పెంపొందించడమే.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.