భక్తులసేవలో స్కౌట్స్‌ & గైడ్స్‌

భక్తులసేవలో స్కౌట్స్‌ & గైడ్స్‌

తిరుమల, సెప్టెంబర్‌-10,  2009: ప్రతి నిత్యము వేలాదిమంది భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తున్నారు. వీరికి సేవలను అందిస్తున్న తితిదే స్కౌట్‌ మరియు గైడ్స్‌ సభ్యుల కృషి ప్రశంసనియం. స్కౌట్స్‌ & గైడ్స్‌ అవసరం దృష్ఠ్యా అప్పటి తితిదే కార్యనిర్వహణాధికారి ఉమాపతి ప్రభుత్వంతో చర్చించి 1968 జూన్‌ 7వ తేది తితిదేకి ప్రత్యేకంగా భారత్‌ స్కౌట్స్‌ మరియు గైడ్స్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స్కౌట్స్‌ ప్రతినిధులు శ్రీవారి భక్తులకు తమ సేవలను అందిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయం, అన్నదానం, కళ్యాణకట్ట మరియు ఇతర అనుబంధ సంస్థలలో సైతం స్కౌట్స్‌ సభ్యులు భక్తులసేవయే భగవంతుని సేవగా భావించి విధులను నిర్వర్థించడం ప్రశంసనియం.

ఈఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 1500 మంది స్కౌట్స్‌ మరియు గైడ్స్‌ సభ్యులు పాల్గొని తమ సేవలను అందించనున్నారు. ఉదయం వాహన సేవకు 500 మంది రాత్రి వాహన సేవకు 500 మంది చొప్పున వీరు బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారు. వీరిలో అధికశాతం మంది యువకులు, విద్యార్థులు వుండడం గమనార్హం. వీరి ఉచిత సేవలకు ప్రతిఫలంగా తితిదే వీరికి శ్రీవారి దర్శనం, తీర్థ ప్రసాదాలను అందిస్తున్నది. వీరు తిరుమలలో బస చేయడానికి తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మునుముందు వీరి సేవలను మరింతగా వినియోగించుకోవాలని తితిదే అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా వీరు ఈ తొమ్మిది రోజులపాటు తిరుమలలోని పలు విభాగాలలో భక్తులకు ఉచిత సేవలను అందించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.