మహిళలకు ఆదర్శమూర్తి తరిగొండ వెంగమాంబ : శ్రీ సముద్రాల లక్ష్మణయ్య

మహిళలకు ఆదర్శమూర్తి తరిగొండ వెంగమాంబ : శ్రీ సముద్రాల లక్ష్మణయ్య

తిరుపతి, 2012 జూలై 26: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నేటి మహిళామనులకు ఆదర్శనీయమని తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య అన్నారు. తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఉదయం తరిగొండ వెంగమాంబ 195వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఉదయం 10.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టువారు సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య ”యోగవాసిష్టం – తరిగొండ వెంగమాంబ అనువాదం” అనే అంశంపై ప్రసంగిస్తూ వాల్మీకి రచించిన యోగవాసిష్టంలో 32 వేల స్లోకాలు ఉన్నాయని, ఇది అద్వైత వేదాంత గ్రంథమని అన్నారు. శ్రీరాముడికి వశిష్టుడు చేసిన ప్రబోధమని, దీనిని తరిగొండ వెంగమాంబ ద్విపద చందస్సులో 300 పుటలకు విస్తరించిన గ్రంథంగా అనువదించిందన్నారు. ఈ గ్రంథం రాసి వెంగమాంబ తరించారని, దీనిని అధ్యయనం చేసేవారు కూడా భగవంతుని అనుగ్రహానికి పాత్రులై తరిస్తారని ఆమె పేర్కొన్నారని సముద్రాల లక్ష్మణయ్య వివరించారు.

అనంతరం హైదరాబాదుకు చెందిన ముక్తేవి భారతి ”తెలుగు సాహిత్యము – తరిగొండ వెంగమాంబ” అనే అంశంపై ప్రసంగిస్తూ చాలాకాలం వరకు వెంగమాంబను కవులు గుర్తించలేదని, తదనంతర కాలంలో ఆమె సాహిత్య విలువను గుర్తించారని తెలిపారు. బాల్య జీవితంలోని కష్టాలు ఆమెను భగవంతుడి మార్గంలోకి మళ్లించాయని వివరించారు.

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి భారతి ” వెంగమాంబ రచనల్లోని భక్తితత్వం” అనే అంశంపై ఉపన్యసిస్తూ మానవజీవిత లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారమని తెలిపారు. వెంగమాంబ రచనల్లో భక్తిభావం ఎలా ఉందనే విషయాన్ని అన్ని గ్రంథాల నుండి ఉదహరిస్తూ ఉపన్యసించారు.

తిరుపతిలోని శ్రీ పద్మావతి జూనియర్‌ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్‌ ఎ.జయమ్మ ”వెంగమాంబ రచనల్లోని సుందరస్తుతి సన్నివేశాలు – ఒక సమీక్ష” అనే అంశంపై ప్రసంగిస్తూ
సమన్యాయాత్మకంగా సకల దేవతలను స్తుతించిన గొప్ప భక్తురాలు వెంగమాంబ అన్నారు. ఈనాటి కాలంలో ఈ సమన్యాయం చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు.

వెంగమాంబ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 6.30 గంటలకు కాకినాడకు చెందిన శ్రీ పవన్‌కుమార్‌ బృందం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవితచరిత్రను తోలుబొమ్మలాట రూపంలో ప్రదర్శించనున్నారు.

ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ ఆచార్య జె.కె.కృష్ణమూర్తి, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.వాణి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో పురప్రజలు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.