మే 22 నుండి 24వ తేది వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

 మే 22 నుండి 24వ తేది వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల, 2010 మే 05: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22వ తేది నుండి 24వ తేది వరకు మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలు కన్నులపండుగగా జరుగుతాయి.

ఈ సందర్భంగా ఆలయంలో శ్రీవారికి జరిగే ఆర్జిత సేవలైన బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను మూడు రోజులు రద్దుచేశారు.

వైశాఖ శుద్ద నవమినాడు పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవం జరగడం ఆనవాయితి. ఆరోజు సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు గజవాహనంపై, శ్రీదేవి భూదేవులు పల్లకిపై వేంచేసి, ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనం చేరుకొంటారు. అక్కడ పరిణయోత్సవపు వేడుకలు ఘనంగా జరుగుతాయి. సంగీత కచ్చేరీలు ఆస్థానం జరిగిన తర్వాత శ్రీ స్వామివారు దేవేరులతో కలసి ఆలయం చేరుకొంటారు.

అలాగే రెండవ రోజు వైశాఖ శుద్ధ థమిరోజు అశ్వవాహనంపైన, మూడవరోజు వైశాఖశుద్ధ ఏకాదశి రోజు గరుడవాహనంపైన శ్రీవారు వేంచేయగా, పల్లకిలో దేవేరులు వేంచేస్తారు. నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయోత్సవం వేడుకలు వైభవంగా జరుగుతాయి.

ఆర్జితంగా జరిగే ఈ పద్మావతీ పరిణయోత్సవాలలో పాల్గొనదలచిన భక్తులు రు.5000/ చెల్లించి 5 మంది పాల్గొనవచ్చును. వీరికి శ్రీవారి పట్టుశాలువ, రవిక, 10 పెద్ద లడ్డులు, 10 వడలు ఇస్తారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.