శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టోత్తరశత(108)కుండాత్మక అద్భుత మహాశాంతి యాగం

శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టోత్తరశత(108)కుండాత్మక అద్భుత మహాశాంతి యాగం

తిరుపతి, జనవరి – 16,2011: తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జనవరి 29,30,31వ తేదిలలో స్థానిక శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో లోకకల్యాణార్థమై అష్టోత్తరశత(108)కుండాత్మక అద్భుత మహాశాంతి యాగం వైభవంగా నిర్వహించాలని తితిదే ఇ.ఓ శ్రీ ఐ.వై.ఆర్‌ కృష్ణారావు అధికారులను కోరారు.

శనివారం ఉదయం తితిదే పరిపాలనాభవనంలో అద్భుతమహాశాంతి యాగం నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఇ.ఓ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సమస్త లోకాల శాంతి సౌభాగ్యాల కోసం సర్వమానవ సమైక్యం కోసం, శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యానుగ్రహం కోసం నిర్వహిస్తున్న ఈ అద్భుత శాంతి యాగంలో ఈ మూడు రోజులలో ప్రతి రోజు ఉదయం 8.30 గంటలకు యాగ ప్రారంభం, మధ్యాహ్నాం 12 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా జనవరి 31వ తేదిన ఉదయం 11.45 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుదని, ఈ కార్యక్రమంలో రాష్ట్రముఖ్యమంత్రి వర్యులు పాల్గొంటారని ఆయన వివరించారు.

ఈ సమావేశంలో జె.ఇ.ఓ డా||యన్‌.యువరాజ్‌, ముఖ్యభద్రతాధికారి శ్రీ పి.వియస్‌.రామకృష్ణ, ఛీఫ్‌ ఇంజనీరు శ్రీ వి.ఎస్‌.బి.కోటేశ్వరరావు, హిందూధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీఆర్‌.కవితా ప్రసాద్‌, తితిదే స్థానికాలయాల ఆగమసలహాదారు శ్రీవిష్ణుభట్టాచార్యులు, వేదిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిదానం సుదర్శన శర్మ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.